కలియుగ వైకుంఠనాథుడు, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు చివరిదశకు చేరుకున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో తనకు ప్రీతి పాత్రమైన గరుడ వాహనంతో పాటు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి నేటి ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనాలపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు.
సప్తాశ్వరథంలో శ్రీనివాసుడు
బ్రహ్మోత్సవంలో సూర్యప్రభ వాహన సేవకు ఓ ప్రత్యేకత ఉంది. స్వామి ఆజ్ఞతోనే సూర్య, చంద్ర గమనాలు ఉంటాయనే నమ్మకం. నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ఆ భానుడికి అధిపతి శ్రీ మహావిష్ణువే అనే అంతరార్థాన్ని బోధించేలా సూర్యప్రభ వాహనం ఉంటుంది. బంగారు పూత పూసిన సప్త అశ్వాలతో రూపొందించిన వాహనంపై స్వామివారిని అలంకరిస్తారు. ఈ వాహనంపై మలయప్ప స్వామి వారు ఏకాంతంగా సూర్యనారాయణ స్వామి అవతారంలో దర్శనమిస్తారు. సూర్యప్రభవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామిని దర్శించుకోవడం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలిగి రాజదర్శనం, రాజానుగ్రహం, ప్రభుత్వపరమైన, పితృ సంబంధమైన అనుకూలాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
సకల శుభం.. చంద్రప్రభ వాహనం
ఉదయం సూర్యప్రభ వాహన సేవ అనంతరం స్వామి వారు చంద్రప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు. సర్వభూషితాలంకరణలతో మలయప్ప స్వామి బాలకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. చంద్రుని తేజోరూపమైన ఈ వాహన సేవలో స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురాణ పండితులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని దర్శించుకున్న భక్తులు మధురానుభూతి చెందుతున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీపై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న సర్కార్