Amaravati Farmer Madhava Rao : మహా పాదయాత్రలో యువకుల కంటే చురుగ్గా నడుస్తూ మాధవరావు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. గత ఏడాది అమరావతి నుంచి తిరుపతి దాకా చేసిన యాత్రలో 45 రోజులపాటు నడిచారు. ఐదేళ్ల కిందట 1,400 కి.మీ. నడిచి 66 రోజుల్లో కాశీ వెళ్లానని చెబుతున్న మాధవరావును ‘ఈనాడు- ఈటీవీ భారత్’ పలకరించింది.
అమరావతి- తిరుపతి పాదయాత్రలో మాధవరావు ఏనాడూ అన్నం తినలేదు. పళ్లు, కాయగూరలు తీసుకున్నారు. రాత్రిపూట అందరూ నిద్రపోతున్నా, మెలకువగా ఉండేవారు. ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవారు. ప్రస్తుత పాదయాత్రలోనూ అదే జీవనశైలిని అనుసరిస్తున్నారు. తొలిరోజు మధ్యాహ్న భోజన విరామ సమయంలో అందరూ అన్నం, పప్పు, పచ్చడి వంటివి తింటే, మాధవరావు వంటవాళ్ల దగ్గరకు వెళ్లి నాలుగు క్యారెట్లు, నాలుగు దొండకాయలు, రెండు నిమ్మకాయలు తీసుకుని... వాటినే ఆరగించారు.
ఆరెకరాలు ఇచ్చారు: మాధవరావు తన ఆరెకరాల్ని రాజధాని నిర్మాణానికి ఇచ్చేశారు. భార్య మరణించారు. కుమారుడు, కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. అన్నదమ్ములు ఆయన బాగోగులు చూస్తున్నారు. ఎందుకు ఇలాంటి జీవనశైలిని అలవాటు చేసుకున్నారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఒకప్పుడు వ్యవసాయం చేసేవాడిని. కాయకష్టం చేసేటప్పుడు రోజుకు 5 పూటలా తినేవాడిని. 2007 నుంచి వ్యవసాయం ఆపేశాను. ధ్యానం నేర్చుకున్నాను. 2010 నుంచి క్రమంగా నిద్రను తగ్గించుకున్నాను. ఆ తర్వాత పొలాన్ని రాజధానికి ఇచ్చేశాను. తిండి తగ్గించుకుని బతకడానికి ఎంత అవసరమో అంతే తింటున్నా. ఇంటి దగ్గర ఉంటే ఉదయం నిమ్మకాయ నీళ్లు తాగుతా. మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేస్తా. ఎక్కువ సమయం యోగాసనాలు వేస్తూ, ధ్యానం చేస్తూ గడుపుతా. రోజుకు 30 నుంచి 45 నిమిషాలు నిద్రపోతా. అది సరిపోతుంది. నాకు బీపీ, మధుమేహం లేవు. ఎంతదూరమైనా సరే నడవటం నాకిష్టం’ అని తెలిపారు.