పెళ్లి వేడుకలు, ఇతర శుభకార్యాల్లో తప్ప రోజూ భారీ నగలు పెట్టుకోం. మహా అయితే మెడలో ఒక చెయిన్, వేళ్లకు ఉంగరాలు, చెవిదిద్దులు, బ్రేస్‌లెట్/గాజులు, కాళ్లకు పట్టీలు.. వంటి వాటినే రోజువారీ ధరించడానికి మొగ్గు చూపుతుంటాం. అయితే ఇంటికొచ్చాక ఇతర వస్తువుల మాదిరిగానే వీటినీ శానిటైజ్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఒకవేళ వాటిపై వైరస్ ఉంటే నిర్వీర్యమైపోయి.. మన శరీరంలోకి ప్రవేశించకుండా, ఇతర ఉపరితలాలకు అంటుకోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, వీటిని శానిటైజ్ చేయడానికీ ఓ పద్ధతుంటుందట! అప్పుడే రోజూ శుభ్రం చేసినా వాటి మెరుపు తగ్గకుండా ఉంటుందంటున్నారు నిపుణులు.
అన్నీ ఓ బాక్స్‌లో పెట్టి..!
మొబైల్, పర్సు.. వంటి వస్తువుల్ని శానిటైజ్ చేసేందుకు ఇప్పటికే చాలామంది యూవీ స్టెరిలైజర్ బాక్స్ కొనే ఉంటారు. రోజూ ధరించే జ్యుయలరీ శానిటైజేషన్ కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలో మీరు ధరించిన నగలన్నీ అందులో పెట్టి స్విచ్ ఆన్ చేసి రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ ప్రక్రియ వల్ల వాటిపై ఉండే సూక్ష్మ క్రిములు సైతం సమూలంగా నశించిపోతాయంటున్నారు నిపుణులు. అయితే ఈ బాక్స్ విడుదల చేసే అతినీల లోహిత కిరణాల తరంగదైర్ఘ్యం 100-280 నానోమీటర్లుగా ఉంటే మరింత సమర్థంగా పని చేస్తుందని చెబుతున్నారు. కొత్తగా స్టెరిలైజర్ బాక్స్ కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవడం మరవద్దు.
గోరువెచ్చటి నీటితో..!
చాలామంది ఉంగరాలు, చెయిన్స్‌ను శుభ్రం చేయకుండా వాటిని రోజంతా పక్కన పెట్టేస్తే.. వాటిపై ఉండే వైరస్ నిర్వీర్యమైపోతుందనుకుంటారు. కానీ లోహాలపై వైరస్ మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా బతికే ఉంటుందని సీడీసీ చెబుతోంది. కాబట్టి స్టెరిలైజర్ బాక్స్ అందుబాటులో లేకపోతే ప్రత్యేకంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ముత్యాల ఆభరణాలు తప్ప మిగతావన్నీ డిష్వాష్ సోప్ కలిపిన గోరువెచ్చటి నీటిలో వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బ్రష్‌తో మృదువుగా రుద్ది.. కుళాయి నీళ్లతో కడిగేయాలి. ఆపై శుభ్రమైన కాటన్ వస్త్రంతో పొడిగా తుడవాలి.
వెండి నగలైతే ఇలా!
వెండి నగల్ని శానిటైజ్ చేసే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తే వాటిపై ఉండే వైరస్ నిర్వీర్యమవడంతో పాటు వాటి మెరుపూ తగ్గకుండా జాగ్రత్తపడచ్చు. ఈ క్రమంలో సబ్బు నీరు కలిపిన వేడినీటిని ఉపయోగించినా అవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఈ మిశ్రమం ఉపయోగించచ్చు. ముందుగా ఒక గిన్నెలో అడుగున అల్యూమినియం ఫాయిల్ వేసి.. వేడి నీళ్లు (మరీ వేడిగా, గోరువెచ్చగా లేకుండా మధ్యస్తంగా ఉండాలి) పోయాలి. ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు కొద్దికొద్దిగా వేసి, టేబుల్‌స్పూన్ వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో వెండి ఆభరణాల్ని పావుగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత పొడిగా తుడిచేస్తే సరిపోతుంది.
ఇవి గుర్తుపెట్టుకోండి!
* కరోనా పరిస్థితుల్లో ముత్యాలు, రాళ్లు పొదిగిన నగల్ని సాధ్యమైనంత మేర పెట్టుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటికి పదే పదే నీళ్లు తగిలితే అవి త్వరగా పాడైపోతాయి. ఒకవేళ వాటిని ధరించినా మార్కెట్లో దొరికే ప్రత్యేకమైన జ్యుయలరీ క్లీనర్స్‌తో శుభ్రం చేయమంటున్నారు.
* బయటి నుంచి వచ్చాక ఉంగరాలు తొలగించి చేతులు కడుక్కోవడం చాలామందికి అలవాటు. కానీ ఉంగరాలతో పాటే చేతులు శుభ్రం చేసుకొని.. ఆపై నగల్ని విడిగా శానిటైజ్ చేయాలి. అంతేకాదు.. ఉంగరాలు ధరించిన చోట చర్మాన్ని మరోసారి శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
* ఇతర వస్తువుల్ని శానిటైజ్ చేసినట్లే.. నగల పైనా శానిటైజర్ స్ప్రే చేస్తామంటే కుదరదు. ఎందుకంటే వాటిలో ఉండే ఆల్కహాల్, ఇతర రసాయనాలు నగల మెరుపును దెబ్బతీస్తాయి. కాబట్టి వాటికి శానిటైజర్ ఉపయోగించకూడదు.
* నగల్ని శానిటైజ్ చేయడానికి మార్కెట్లో ప్రత్యేకంగా డిస్-ఇన్ఫెక్ట్/శానిటైజింగ్ వైప్స్ దొరుకుతున్నాయి. వాటితోనూ శుభ్రం చేసుకోవచ్చు.
* ముఖం శుభ్రపరచుకునే క్రమంలో ముందుగా వేళ్లకు పెట్టుకున్న ఉంగరాలు తొలగించి.. ఆపై చేతులు కడుక్కున్నాకే ముఖం కడుక్కోవాలట!
ఇదీ చదవండి: Maoist Hari Bhushan: మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి: ఎస్పీ సునీల్ దత్