శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అసెంబ్లీ కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలను కరోనా కారణంగా ఈసీ గతంలో వాయిదా వేసింది. దీంతో జూన్ మూడో తేదీ నుంచి ఆ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొవిడ్ ఉద్ధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.
ఈసీ లేఖకు సమాధానమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 600కు పైగా నమోదు అవుతుండడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సబబు కాదని వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం పంపింది. దీనిపై ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఆకుల లలిత, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బొడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీ కాలం గత జూన్ మూడో తేదీన ముగిసింది. వీరంతా తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆకుల లలిత, కడియం శ్రీహరి, నేతి విద్యాసాగర్, బొడకుంటి వెంకటేశ్వర్లు 2015 జూన్ 4న ఎన్నికయ్యారు. ఫరీదుద్దీన్ 2016 ఆక్టోబర్ 13న ఎన్నికయ్యారు. గుత్తా సుఖేందర్ రెడ్డి 2019 ఆగస్టు 19న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా చేయగా ఆయన స్థానంలో ఫరీదుద్దీన్ను ఎన్నుకున్నారు. యాదవ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించటంతో ఆయన స్థానంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి: BANDI SANJAY: ఈటలకు బండి సంజయ్ పరామర్శ
Irrigation Projects : సాగర్లో కృష్ణమ్మ సందడి.. జూరాల 47 గేట్లు ఎత్తివేత