Increasing corona cases: దిల్లీ, కేరళ, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, మిజోరం తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో.. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా లేఖలు రాశారు. దీంతో తెలంగాణ ఆరోగ్య శాఖ.. నాలుగో దశ ముప్పు వచ్చినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది. అన్ని జిల్లాల్లోనూ కేసుల పెరుగుదలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఎక్కడైనా కేసులు పెరుగుతుంటే.. వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించేలా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో గత ఆరు వారాలుగా కరోనా బాగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రోజుకు సగటున 20-25 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. వీటిలోనూ 95 శాతానికి పైగా హైదరాబాద్‌లోనే నిర్ధారణ అవుతున్నాయి. గత రెండు వారాల కేసులను పరిశీలిస్తే పాజిటివిటీ రేటు సుమారు 0.14-0.20 శాతం మాత్రమే నమోదవుతోంది. ప్రజల్లోనూ కొవిడ్ భయం పోయింది. యథేచ్ఛగా మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు.
వ్యాప్తి మొదలైతే అతి వేగమే!
దేశం మొత్తమ్మీద గత రెండు నెలలుగా కొవిడ్ తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికి మించడంలేదు. వారం రోజుల పాజిటివిటీ రేటు కూడా 1 శాతం దాటడం లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 12 నుంచి 19 వరకూ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగడాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. ఉదాహరణకు హరియాణాలో వారం రోజుల్లోనే కొవిడ్ పాజిటివిటీ రేటు 1.22 శాతం నుంచి 2.86 శాతానికి పెరిగింది. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, మిజోరంలలోనూ పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఒక్కసారి వైరస్ వ్యాప్తి మొదలైతే.. అత్యంత వేగంగా విస్తరిస్తుందని, కొవిడ్ జాగ్రత్తలు పాటించడంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దని సూచించింది.
ఇదీ చదవండి:DH on Vaccine: ఆ వయసు వారికి ఉచితంగా బూస్టర్ డోసు పంపిణీకి చర్యలు: డీహెచ్