రైల్వే అధికారుల వేధింపులు తాళలేక రైల్వే కాంట్రాక్టర్ వెంకట్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు, దక్షిణ మధ్య రైల్వే కాంట్రాక్టర్ల సంఘం నాయకులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ రైల్వే జీఎంను కలిసి విన్నవించారు. ఆత్మహత్యకు కారణమైన రైల్వే డిప్యూటీ సీఈ ఎస్‌కే శర్మ, రైల్వే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన జీఎం ఆ విషయంపై పూర్తి విచారణ జరిగిన అనంతరం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
సూసైడ్ నోట్ ప్రకారం..
తాను చనిపోవడానికి రైల్వే డిప్యూటీ సీఈ ఎస్‌కే శర్మ కారణమని లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 22 న రాత్రి 10-11 గంటల మధ్య మాగనూరు కాంట్రాక్టర్ క్యాంపు కార్యాలయంలో సదరు అధికారి మద్యం మత్తులో అందరి ఎదుట తనను పరుష పదజాలంతో దూషించినట్లు రాశారు. అలాగే ఫిబ్రవరి 28న తనను సైట్ నుంచి వెళ్లిపోవాలని వారు బాధించినట్టు లేఖలో రాసి ఉంది. శర్మతో పాటు సీపీ డబ్ల్యూఐ ఎన్బీ శ్రీనివాస రావు ఇబ్బంది పెడుతూ దూషించే వారని... క్యాంపు కార్యాలయంలో దొరికిన వెంకట్ రెడ్డి డైరీ ద్వారా బంధువులకు తెలిసింది. బాధితుడి బంధువులు రైల్వే ఉన్నతాధికారులకు సూసైడ్ నోట్ ఆధారంగా ఫిర్యాదు చేశారు.
వెంకట్ రెడ్డి మహబూబ్‌నగర్ – మునీరాబాద్ మధ్య రూ.14 కోట్లతో జరుగుతున్న రైల్వే పనులు కాంట్రాక్టు తీసుకన్నారు. వెంకటరెడ్డి పనుల బిల్లుల విషయంలో జాప్యం జరిగిందని మరో రైల్వే కంట్రాక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అతనిపై అధికారి ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి : 'రెండు పడకల గదుల ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు..?'