వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో వరదాచార్యులు- కనకవల్లి దంపతులకు 1939 సెప్టెంబరు 10న రాఘవాచారి జన్మించారు. వైష్ణవ సాంప్రదాయంలో పెరిగారు. ఆనాటి పద్ధతిలో ఇంట్లోనే విద్యను అభ్యసించారు. అమ్మ దగ్గర తమిళం నేర్చుకుంటే... అన్నయ్యలతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో భావనారాయణ సంస్కృత కళాశాలలో సంస్కృత విద్యనభ్యసించారు. 15 ఏళ్లకే ఉర్దూ, సంస్కృతంలో రాటుదేలారు.
విద్యాభ్యాసం
1961లోఉస్మానియాలో లా కోర్సు’ చదివి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అప్పుడే మాజీ కేంద్ర మంత్రి ఎస్.జయపాల్ రెడ్డితో రాఘవాచారి సన్నిహితులయ్యారు. వరంగల్ నుంచి ఎంఎస్ ఆచార్య నిర్వహణలో వెలువడే జనధర్మలో తొలి రచన ప్రచురితమైంది. కళాశాల స్థాయిలోనే "ఓరుగల్లు వర్ణన"వ్యాసం రాసి ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. అప్పటినుంచి పాత్రికేయ రంగంవైపు దృష్టి మళ్లింది. 1971లో విజయవాడ వెళ్లి విశాలాంధ్రలో చేరారు. కొద్ది కాలానికే ఆ పత్రికకు సంపాదకులయ్యారు. అక్కడ మూడు దశాబ్దాల పాటు సేవలందించారు.
బహుభాషా కోవిదుడు
లోతైన విశ్లేషణ, పదునైన వ్యాఖ్యానం, ఏ రంగంలో ఏ అంశంపైనైనా నిక్కచ్చిగా నిబద్ధతతో మాట్లాడే వ్యక్తి చక్రవర్తుల రాఘవాచారి. సి.రాఘవచారిగా, సిరాగా, విశాలాంధ్ర రాఘవచారిగా పిలిపించుకున్న ఆయన.. సంస్కృతం, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పండితుడు.
అస్తమయం
గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రాఘవాచారి ... తెల్లవారు జామున హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సాయంత్రం విజయవాడలోని పిన్నమనేని వైద్య కళాశాలకు రాఘవచారి భౌతిక కాయాన్ని అప్పగించనున్నారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ డిమాడ్లపై' సీఎం సమీక్ష... నేడు హైకోర్టుకు సమర్పణ..