కరోనా బాధితులు తుమ్మినా, దగ్గినా నోటి నుంచి వెలువడే తుంపరలు ఎదుటి వ్యక్తిపై పడకూడదు. వాటి ద్వారా వైరస్ మరో వ్యక్తికి చేరుతుంది. ఇలా సోకిన కోవిడ్-19 వైరస్ దాదాపు 24 గంటల వరకూ సదరు వ్యక్తి నోట్లో, గొంతువద్ద ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నోటి ద్వారా వెళ్లే ఈ వైరస్‌ను ముందుగానే నిరోధించొచ్చు అంటున్నారు డాక్టర్ సుమన్ కపూర్. ఇందుకోసం ఈమె మౌత్‌వాష్ ఫార్ములాపై పరిశోధన చేపట్టారు. లాలాజలంలో, దంతాల వెనుక, గొంతులో చేరే బ్యాక్టీరియాను సమూలంగా ఈ మౌత్‌వాష్ నాశనం చేసినట్టు పరిశీలనలో తేలిందని చెప్పారామె.
కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఈ ఫార్ములాను తయారుచేయడానికి నెలరోజులు పరిశోధనలు చేశారు. ప్రయోగాత్మకంగా వినియోగించడానికి మరో 30 రోజులు సమయాన్ని తీసుకున్నారు. ప్రతిఒక్కరూ రోజుకి రెండు సార్లు ఈ మౌత్‌వాష్‌ను పుక్కిలిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిపారామె.
మొక్కల నుంచి తయారయ్యే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, పోషకాలుండే పదార్థాలు, మూలికలను మౌత్‌వాష్ తయారీలో వినియోగించా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) శాస్త్రీయంగా అనుమతించిన మొక్కల నుంచే ముడిపదార్థాలు తీసుకున్నా. సాధారణంగా మార్కెట్‌లో లభ్యమయ్యే కొన్నిరకాల మౌత్‌వాష్‌లలో రసాయనాలు వాడుతూ ఉంటారు. ఇందులో నేను పూర్తిగా సహజ సిద్ధమైనవాటిని వినియోగించడంతో దుష్ప్రభావాలుండవు.’’ - డాక్టర్ సుమన్‌కపూర్