Tension at Amaravati farmers Padayatra: ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రైతుల మహా పాదయాత్రలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాదయాత్ర చేస్తున్న రైతులను రెచ్చగొట్టేలా వైకాపా కార్యకర్తలు వ్యవహరించారు. శాంతియుతంగా నడిచి వెళ్తున్న రైతులు, అఖిలపక్ష నేతలపై వైకాపా కార్యకర్తలు బాటిళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ వద్దకు ముందుగానే నల్లబెలూన్లతో వచ్చిన వైకాపా శ్రేణులు.. 3 రాజధానులకు మద్దతుగా నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్ దద్దరిల్లింది.
రైతులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్న అయ్యప్ప భక్తులును కూడా పోలీసులు పక్కకు ఈడ్చేశారు. నీళ్ల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లతో రైతులపై దాడికి దిగారు. బాటిళ్లు ఎత్తు నుంచి వేగంగా వచ్చి పడటంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. అమరావతి రైతుల పాదయాత్రపై.. వైకాపా శ్రేణులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా కార్యకర్తలు బాటిళ్లు విసురుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు.
పాదయాత్రికులపైకి కార్యకర్తలను వైకాపా ఎంపీ భరత్ ఉసిగొల్పారని ధ్వజమెత్తారు. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర పన్నారని మండిపడ్డారు. వాటర్ బాటిళ్లు, నీళ్ల ప్యాకెట్లు విసిరితే ఏమనుకోవాలని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములిస్తే అవమానపరుస్తున్నారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రాజధానులు కావాలనుకుంటే భూములిచ్చి డిమాండ్ చేయాలని అంటున్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వ్యక్తులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
అచ్చెన్నాయుడు: అమరావతి రైతులపై దాడి దుర్మార్గమని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. త్యాగాలు చేసిన రైతులకు ఇచ్చే గౌరవమిదేనా? అని నిలదీశారు. వైకాపా ఎంపీ ఆధ్వర్యంలో దాడి జగన్ అరాచక పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ జరిగింది.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. నేరస్థుడి పాలనలో ఏపీ నాశనమవుతున్న విషయం మరోసారి బహిర్గతమైందని చెప్పారు. దాడి జరుగుతున్నా పోలీసులు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలని ధ్వజమెత్తారు. పాదయాత్రకు కూడా రక్షణ కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన రైతులకు జగన్ ఇచ్చే గౌరవమిదేనా? అని ప్రశ్నించారు. అక్రమ కేసులతో వేధిస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎంపీ భరత్‌తో పాటు వైకాపా నేతలందరిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
గద్దె తిరుపతిరావు: శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రపై దాడులు చేయాల్సిన అవసరమేంటని అమరావతి పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతమందిని చంపుతారో చంపండని గద్దె తిరుపతిరావు ధ్వజమెత్తారు. హైకోర్టు అనుమతితో పాదయాత్ర చేస్తున్నామని స్పష్టం చేశారు. డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నాం... మాకు రక్షణ కల్పించండి అని వేడుకున్నారు. ఇలాంటి దొంగలు, రౌడీయిజం చేసేవాళ్లు ప్రజాప్రతినిధులా? అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు దొంగలకు కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాము పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని తమపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. డీజీపీ తన అంతరాత్మకు సమాధానం చెప్పుకోవాలని గద్దె తిరుపతిరావు డిమాండ్ చేశారు.
న్యాయవాది ముప్పాళ్ల: శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారని న్యాయవాది ముప్పాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుంటారా? అని నిలదీశారు. వాటర్ బాటిళ్లు, నీళ్ల ప్యాకెట్లు విసిరితే ఏమనుకోవాలన్నారు. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన వ్యక్తులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆజాద్ చౌక్ మీదుగా వెళ్తుంటే అక్కడే సమావేశానికి అనుమతి ఎలా ఇచ్చారని నిలదీశారు. నియంతృత్వ పోకడలు ఎక్కువకాలం సాగవని గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయ స్వార్థం కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించొద్దని కోరారు.
ఇవీ చదవండి:
జయలలిత మృతి కేసులో ట్విస్ట్.. శశికళపై డౌట్స్.. చనిపోయాక 31 గంటల తర్వాత..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ప్రస్తుత ధరలు ఎంతంటే?
అయోధ్య రామమందిరం కూల్చివేతకు పీఎఫ్ఐ కుట్ర.. 'బాబ్రీ' పునర్నిర్మాణం కోసం..!