రాష్ట్రవ్యాప్తంగా మార్చి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నెల 7 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 3న 42.8, ఖమ్మం జిల్లాలో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాలులు వీచాయి. అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల చేరువకు వచ్చాయి. హైదరాబాద్‌లోనూ 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా వాతావరణం చల్లబడింది. ఆదిలాబాద్ జిల్లా మినహా మిగితా జిల్లాల్లో నిన్న 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల ఇవాళ, రేపు... ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం పడే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. ఈరోజు ఉత్తర, దక్షిణ ఉపరితల ద్రోణి... నైరుతి మధ్యప్రదేశ్ నుంచి కోమరిన్ ప్రదేశం వరకు.... మరట్వాడా, మధ్య మహారాష్ట్ర కర్ణాటక, కేరళ మీదుగా సముద్రమట్టం నుంచి 0.9కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. శనివారం రాత్రి 8 గంటల వరకు ములుగు జిల్లా వాజేడులో 16.8, మంగపేటలో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ ప్రకటించింది.
ఇవీ చూడండి: సాగర్‌కు కేసీఆర్ రెండుసార్లు రావడం ఎందుకు: రేవంత్