Telugu Students in Ukraine : ఆకాశంలో యుద్ధ మేఘాలు.. బాంబుల మోతలు.. కాళ్ల కింద కంపిస్తున్న భూమి.. గుండెల్లో అలుముకున్న భయంతో ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బంకర్లలో, మెట్రో స్టేషన్లలో తలదాచుకుని.. ప్రాణాలు కాపాడుకుంటున్నారు. నీళ్లతో కడుపు నింపుకొంటూ బతుకీడుస్తున్నారు. ఆహార పదార్థాలు వెంట తీసుకెళ్లి.. ఎంబసీ నుంచి వచ్చే సూచనల కోసం ఎదురుచూస్తున్నారు. శుక్రవారం రోజంతా అవస్థలు పడుతూనే గడపాల్సి వచ్చిందని వాపోయారు.
Hyderabad Students in Ukraine : ‘‘రోజంతా బంకర్‌లోనే తలదాచుకున్నాం. రక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఇతర దేశాలకు తీసుకెళ్లాలని ఎంబసీ అధికారులను కోరుతున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎక్కడి వారు అక్కడే ఉండాలని వారు చెబుతున్నారని’’ ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఉన్న సీతాఫల్‌మండికి చెందిన అనీల వివరించారు.
బండి సంజయ్‌కు వినతి
Telugu Students Stuck in Ukraine : సరూర్‌నగర్‌కు చెందిన నర్సారెడ్డి కుమార్తె డి.దివ్య, కిల్లర శ్రీనివాస్‌రావు కుమార్తె మేఘన, ఆర్కేపురం డివిజన్‌కు చెందిన వేణు కుమార్తె తేజస్విని ఉక్రెయిన్‌లోని జపోరిజియా వైద్య విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. వారి తల్లిదండ్రులు శుక్రవారం సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ద్వారా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పిల్లలను క్షేమంగా తీసుకురావాలని విన్నవించారు.
Hyderabad Students Stuck in Ukraine : పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లోని శ్రీసాయిసిద్థార్థ నిలయంలో ఉండే వేముల శ్రీనివాస్, శ్రీదేవి దంపతుల పెద్ద కుమార్తె కీర్తి ఎంబీబీఎస్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్లి అక్కడే చిక్కుకుపోయింది.
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన గద్దె మధుకర్‌గౌడ్, రేణుక దంపతులు పీర్జాదిగూడ బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె సింధుప్రియ కార్‌కివ్ వర్సిటీలో తృతీయ సంవత్సరం చదువుతోంది.
మన విద్యార్థులను కాపాడాలి: షర్మిల
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ, తెలుగు విద్యార్థులను కాపాడాలని విదేశీ మంత్రిత్వ శాఖకు వైతెపా అధ్యక్షురాలు షర్మిల ట్విటర్ ద్వారా విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు.
తాగునీరు దొరకడంలేదు: రాజుకుమార్
Russia Ukraine War : ‘‘బాంబుల శబ్దాలతో ఆందోళన చెందుతున్నాం. కనీసం తాగడానికి నీరు లభించడం లేదు. 26న భారత్‌కు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నా.. విమానాలన్నీ రద్దు కావడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. విమానాశ్రయం వరకు వెళ్లి తిరిగొచ్చాం.’’ అని పటాన్‌చెరు మండలం చిట్కుల్‌కు చెందిన నర్సింహులు కుమారుడు మీసాల రాజుకుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అతను ఒడేసాలో ఉంటున్నాడు.
నిద్ర పట్టడం లేదు
Russia Ukraine War Updates : ‘‘యుద్ధ విమానాల మోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నాం. ఏ క్షణం ఏమవుతుందోనని కంటిమీద కునుకు ఉండడంలేదు. మమ్మల్ని భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలి’’ అని వీడియో సందేశంలో శంషాబాద్ ఆదర్శనగర్‌కు చెందిన అనంతయ్య కుమార్తె కోరె నిషారాణి వేడుకుంది. ఆమె వినిత్సియా వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది.
దుకాణాలన్నీ మూసివేశారు : హర్షిత
బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ మహాలక్ష్మీనగర్‌కు చెందిన కొర్ర హర్షిత ఉక్రెయిన్‌లో నాలుగో ఏడాది వైద్య విద్య అభ్యసిస్తోంది. ఆమె పరిస్థితిపై తల్లిదండ్రులు రమాదేవి, చందర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్‌లో మాట్లాడుతూ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు.
కుమారుణ్ని క్షేమంగా తీసుకురండి
పాతబస్తీ లాల్‌దర్వాజాకు చెందిన కొత్త వేణుగోపాల్ గుప్తా, జ్యోతిక దంపతుల కుమారుడు రాహుల్ గుప్తా(20) ఉక్రెయిన్‌లోని వినిత్సియా నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం తల్లిదండ్రులు కుమారుడితో ఫోన్‌లో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. తమ కుమారుడిని క్షేమంగా నగరానికి తీసుకురావాలని దంపతులు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్‌ను శుక్రవారం కలిసి కోరారు.