కౌలాలంపూర్, మనీలా విమానాశ్రయాల్లో చిక్కుకున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం కోసం 24 గంటలుగా ఎదురుచూస్తున్నామని అన్నారు. ఆహారం సరిగ్గా అందడంలేదని వాపోయారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు 50-60 రోజుల సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం సోమవారం సూచించింది. వందలమంది తెలుగు విద్యార్థులు మంగళవారం ఉదయం మనీలా (ఫిలిప్పీన్స్) విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంతా మలేసియాలోని కౌలాలంపూర్ మీదుగా భారత్‌కు రావాలి. కొందరు కౌలాలంపూర్‌లో, మరికొందరు మనీలాలో చిక్కుకుపోయారు. భారత్ వచ్చే విమానాలన్నీ రద్దయిన కారణంగా వారంతా విమానాశ్రయంలో రోజంతా పడిగాపులు కాశారు.
కౌలాలంపూర్‌లో 150 మంది, మనీలాలో 60 మంది ఇలా చిక్కుకుపోయారు. విమానాలను అనుమతిస్తున్నట్లు కేంద్రం మంగళవారం రాత్రి ప్రకటించింది. అయితే వివిధ కారణాల దృష్ట్యా విమానాలు పంపించడం ఆలస్యమవుతోంది. అక్కడ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. తమను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.
ఇదీ చూడండి: అక్కడ చిక్కుకున్న విద్యార్థులను కాపాడండి: కేటీఆర్