‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా విడుదల వాయిదా పడినా... అందులోని ఈ పాటకు మాత్రం ఇంకా హైప్ కొనసాగుతూనే ఉంది. బహుశా పాట మీద నమ్మకంతోనో ఏమోగానీ కేవలం లిరికల్‌గానే కాకుండా నిర్మాతలు పూర్తి వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో ముందే రిలీజ్ చేశారు. పల్లెటూరి అమాయకపు ప్రేమకథగా ఈ గీతం సాగిన విధానం, చిత్రీకరించిన తీరుకు కుర్రకారు ఫిదా అయ్యారు. అందుకే 16 కోట్ల మందిపైగా చూసేశారు. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే ఈ పాట ఇంత అదరగొట్టేస్తుంటే... సినిమాతోపాటు రిలీజై నెట్టింట్లో దుమ్మురేపుతున్నాయి మరికొన్ని పాటలు. కోట్ల వ్యూస్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న ఆ తెలుగు పాటలేంటో ఓ లుక్కేద్దామా!
బుట్టబొమ్మా...
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అందులోని ‘బుట్ట బొమ్మా...’ పాట యూట్యూబ్ సెన్సేషన్ అయింది. 31కోట్లకుపైనే వీక్షణలు పొందిన ఈ పాట టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ వచ్చిన సాంగ్‌గా చరిత్ర సృష్టించింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట యూట్యూబ్‌తోపాటు మిగతా సామాజిక మాధ్యమాల్లోనూ యమా ఫేమస్ అయింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం టిక్‌టాక్‌లో ఈ పాటకి స్టెప్పులేసి నెటిజన్లని
ఆకట్టుకున్నాడు.
రాములో రాములా...
దోశ స్టెప్ అనగానే గుర్తొచ్చేది అల్లు అర్జున్ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ‘రాములో రాములా...’ పాట. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 83 లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం 29కోట్ల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచిన ఈ పాట పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
వచ్చిండే...
మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఫిదా’లోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఫిదా చేస్తున్నాయి. సాయి పల్లవి, వరుణ్‌తేజ్ నటించిన ఈ చిత్రంలోని ‘వచ్చిండే..’ పాటను ఇప్పటి వరకూ 26 కోట్ల మందికిపైనే యూట్యూబ్‌లో వీక్షించడంతో మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ యాసలో ఉండే ఈ పాటకి మధుప్రియ గొంతు తోడై జనాల్లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. గౌన్లు వేసుకునే పిల్లల్నుంచి గాగ్రాలు వేసుకునే అమ్మాయిల వరకూ ప్రతి ఒక్కరూ వేదికలపైన ఈ పాటకు స్టెప్పులేస్తూ అలరిస్తున్నారు.
రంగమ్మా మంగమ్మా....
80ల నాటి నేపథ్యంలో సమంత, రామ్‌చరణ్‌లు మాస్ పాత్రల్లో మెప్పించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలోని ‘రంగమ్మా మంగమ్మా...’ పాట యూట్యూబ్‌లో 24కోట్లకుపైనే వ్యూస్‌ను సొంతం చేసుకుని నాలుగో స్థానంలో ఉంది. చంద్రబోస్ కలం నుంచి జాలువారిన ఈ పాటను ఎమ్‌ఎమ్ మానసి పాడింది. యూట్యూబ్‌లో విడుదలైన 15 గంటల్లోనే 20 లక్షల వీక్షణలు అందుకుందీ పాట.
సామజవరగమనా..
చక్కటి సాహిత్యంతో.. ఈతరం కుర్రకారునీ ఓ ఊపు ఊపింది ‘అల వైకుంఠపురంలో’లోని ‘సామజవరగమనా...’ పాట. టీవీలూ, ఎఫ్‌ఎమ్‌లూ... ఎందులో అయినా ఈ పాటే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ సెట్టర్ అయింది. సిద్ధ్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో 20 కోట్లకుపైనే వీక్షణలు పొంది ఐదో స్థానంలో నిలిచింది. జియోసావన్ ఆప్‌లో మొదటి నెలరోజుల్లోనే 10 కోట్లకుపైనే స్ట్రీమింగ్స్ సొంతం చేసుకుంది. పలువురు సెలెబ్రిటీలు కూడా ఈపాటకు డాన్స్ చేస్తూ సోషల్‌మీడియాలో వీడియోలు పంచుకుంటున్నారు.