Wedding Season Started in January 2025 : పుష్యమాసం ముగిసింది. మాఘ మాసం ఆరంభమవ్వడంతో శుక్రవారం నుంచి(ఈ నెల 31) కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. శుభ ముహూర్తాలకు తెరతొలగి, పెళ్లిళ్ల బాజాల, భజంత్రీలతో సహా బరాత్ల మోత మోగనుంది. మాఘ, ఫాల్గుణ మాసాలలో 25 శుభ ముహూర్తాలున్నట్లుగా యాదగిరి క్షేత్రంలోని ఆలయ పంచాంగకర్తలు, పూజారులు, బ్రాహ్మణులు చెబుతున్నారు. దీంతో వివాహాలను కుదుర్చుకునే పర్వాలలో పెళ్లి చూపులు, మాటా ముచ్చట్లు వేగవంతమయ్యాయి. ఈ నెల 31 నుంచి శుభ పర్వాలు మొదలై, మార్చి 6వ తేదీ వరకు పెళ్లి తతంగాలు జరుపుకోవచ్చు.
జనవరి నుంచి ఫిబ్రవరి మాసాల్లో శుభముహూర్తాలు ఇవే : మాఘ మాసంలో జనవరి 31వ తేదీన ఉదయం, రాత్రి రెండు ముహూర్తాలు, ఫిబ్రవరి 2నాటి ఉదయం, రాత్రి 7వ తేదీన ఉదయం, రాత్రి, 13 తేదీన ఉదయం, 14వ తేదీ రాత్రి, 16, 20 తేదీల్లో మూడు వేళల్లో, 22, 23న కూడా రెండేసి ముహూర్తాలున్నాయి. ఫాల్గుణ మాసంలో వచ్చే మార్చి నెల 2న ఉదయం రెండు, రాత్రి రెండు ముహూర్తాలు, 6వ తేదీన 3 వేళల్లో కల్యాణ ఘడియలు ఉన్నట్లుగా పంచాంగకర్తలు తెలిపారు.
సందడి షురూ : ముహూర్తాలు సమీపించడంతో పెళ్లి పెద్దలు ఒకవైపు కుటుంబ సభ్యులు మరోవైపు ఏర్పాట్లపై వ్యూహ రచనకు రంగంలోకి దిగారు. కొనుగోలు, విందు, ఫొటో షూట్, రాకపోకల కోసం ఇరు కుటుంబాల చర్చలు సాగుతున్నాయి. కల్యాణ మండపాలు హంగామాలతో రూపు దిద్దుకుంటున్నాయి.
శుభ గడియలు వచ్చేశాయ్ - పెళ్లికి బాజా మోగింది - కుమారి శ్రీమతి కానుంది - Wedding Season Started