Telangana in Parliament : ఆరు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు.. తెరాస ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకేసింగ్ తెలిపారు. ఇందులో 1. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, 2. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ, 3. మహబూబ్‌నగర్‌లో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు(Green field Airports in Telangana), 4. వరంగల్ జిల్లా మామ్‌నూరు, 5. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, 6. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ పూర్తిచేసి తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తి అన్నది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది డిసెంబరుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు విస్తరణ పూర్తి
TRS MPs in Parliament 2021 : హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని పౌరవిమానయానశాఖ సహాయ మంత్రి జనరల్ వీకేసింగ్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ పూర్తయ్యాక విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 1.2 కోట్ల స్థాయి నుంచి 3.4 కోట్లకు చేరుతుందన్నారు.
రాష్ట్రంలోని స్మార్ట్ సిటీల్లో రూ.752 కోట్ల పనులు పూర్తి
TRS MP KR Suresh Reddy : తెలంగాణ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కింద ఎంపికైన గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లలో ఇప్పటివరకు రూ.752.09 కోట్ల విలువైన 27 పనులు పూర్తయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో తెరాస సభ్యుడు బండ ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఆ రెండు నగరాల్లో రూ.3,720.14 కోట్ల విలువైన 162 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. గత నవంబరు 12 వరకు కేంద్రం ఈ రెండు నగరాలకు రూ.196 కోట్ల చొప్పున విడుదల చేసిందన్నారు.
గిరిజన వర్సిటీకి భూకేటాయింపులో జాప్యం
Parliament Winter Sessions 2021 : తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యంచేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు లోక్‌సభలో తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో ఈ వర్సిటీ ఏర్పాటుకు డీపీఆర్ తయారీ పూర్తయిందని, ఆర్థిక అనుమతులు రావాల్సి ఉందని వివరించారు.
రూ.900 కోట్లు అడిగితే రూ.450 కోట్లు విడుదల చేశాం
తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.900 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు మార్చి 31న రూ.450 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌదరి లోక్‌సభలో తెలిపారు. తెరాస ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
కేంద్రీయ విద్యాలయ ఆన్‌లైన్ క్లాస్‌లకు 50% మంది హాజరు
Telangana MPs in Parliament 2021 : తెలంగాణలోని 35 కేంద్రీయ విద్యాలయాల ఆన్‌లైన్ క్లాస్‌లకు దాదాపు 50% మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ లోక్‌సభలో తెలిపారు. మిగిలిన 50% మంది దశలవారీగా ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారన్నారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
వలస కార్మికులకు రూ.330 కోట్ల సాయం
కరోనా సమయంలో తెలంగాణలోని వలస కార్మికుల కోసం రూ.330 కోట్ల సాయంచేసినట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌తేలి లోక్‌సభలో తెలిపారు. ఎంపీ సంజయ్ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
ఈ-శ్రమ్ పోర్టల్‌లో రాష్ట్రం నుంచి 6లక్షలమంది నమోదు
అసంఘటిత కార్మికుల వివరాల నమోదుకోసం కేంద్ర కార్మికశాఖ ఏర్పాటుచేసిన ఈ-శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 8.97 కోట్లమంది పేర్లు నమోదుచేసుకున్నట్లు ఆ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 14,91,161 మంది, తెలంగాణ నుంచి 6,53,210 మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం సంఖ్యలో ఏపీ 13, తెలంగాణ 17వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు.