koulu rythu Telangana : వరి, ప్రత్యామ్నాయ పంటల్లో.. ఏది సాగుచేయాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు చెబుతున్నారని.. కానీ, విత్తన లభ్యతపై మాట్లాడట్లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కౌలు ఒప్పందాల్లో ముందడుగు పడటం లేదు. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలకు చేరింది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో వరి వేసి సర్కారు కొనకుంటే తాము దళారుల దోపిడీకి గురవడం ఖాయమని కౌలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా ఇలా..
Telangana Farmers : ఉమ్మడి జిల్లాల వారీగా యాసంగిలో వరి సాగుపై అధికారులు ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. నిజామాబాద్‌లో 5 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని అంచనా. ఇందులోనూ కౌలు వ్యవసాయం 30 శాతంగా ఉంది. ఖమ్మంలోనూ 30 శాతం కౌలు కిందే ఉంటోంది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో 20-25 శాతం కౌలు వ్యవసాయం కొనసాగుతోంది. తమకున్న కొంత పొలానికి తోడు మరో రైతు భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తూ జీవిస్తున్న రైతులే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సందిగ్ధంలో వీరు కౌలు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
గ్రామ కమిటీల తీర్మానాలు
Rabi season telangana : సమస్య ఉన్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు రంగంలోకి దిగి ఇరుపక్షాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యాసంగిలో సాధారణంగా ఎకరానికి 70 కేజీలవి 13-15 బస్తాల వడ్లు, లేదా రూ.13-15 వేల నగదు కౌలుగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెట్ట ప్రాంతాల్లో ఆరు బస్తాలు, మాగాణిలో అయితే 8 బస్తాలు ఇవ్వాలని పలుచోట్ల కమిటీలు నిర్ణయించాయి.
కౌలు వదులుకున్నా..
Koulu Rythu Problems : నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్నా. వానాకాలంలో పడ్డ ఇబ్బందులు చూశాక ఆందోళనగా ఉంది. ఇక్కడ వరి తప్ప ఇతర పంటలు పండవని అధికారులకూ తెలుసు. చేసేదేమీ లేక కౌలు వదులుకున్నా.
- మల్లయ్య, హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా
సొంతభూమికే పరిమితమయ్యాం..
Paddy procurement issue : మాకు ఏడెకరాల పొలం ఉంది. పక్క రైతుకు చెందిన ఆరెకరాలు కొంతకాలంగా కౌలు చేస్తున్నాం. ఇప్పుడు వరి వద్దంటున్నారు. వేసినా అమ్ముకొనే పరిస్థితి ఉండదు కనుక సాగు తగ్గించుకోవాలని అనుకున్నాం. కౌలు నుంచి తప్పుకొన్నాం. సొంతభూమికే పరిమితమయ్యాం.
- కార్తీక్, దేవరకాద్ర, మహబూబ్‌నగర్ జిల్లా
ఎకరాకు రూ. 8 వేలకు ఒప్పించా
నాకున్న అయిదెకరాలతోపాటు మరో పాతిక ఎకరాలు కౌలు చేస్తుంటాను. యాసంగిలో ఇది వరకు 13 సంచులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇస్తానని ఒప్పించా.
-ప్రవీణ్‌కుమార్, రుద్రూర్, నిజామాబాద్ జిల్లా