Free Treatment for Gurukul Students : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది. వారికి డబ్బులేమీ తీసుకోకుండా వైద్య సేవలందించాలన్న నిబంధన అమలు కావడం లేదు. దీంతో అత్యవసర వైద్యం కోసం పిల్లలను ఆసుపత్రుల్లో చేర్చినా ఫీజులు కట్టేవరకు వైద్యం లభించడం లేదు. నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సొసైటీ నిధుల నుంచి దాదాపు 50 మందికి అత్యవసర చికిత్స అందేలా చూశారు. ఉచితంగా అందించాల్సిన చికిత్సకు ఫీజులు కట్టాల్సి రావడంతో సొసైటీలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Free Treatment for Students : గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందించాలని గతంలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ప్రైవేటు ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతులు తీసుకునే సందర్భంగా ప్రతి సంవత్సరం కొంత మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే నిబంధన ఉంటుంది. అయితే ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిబంధనను పాటించడంలేదు. దీని అమలుపై ప్రభుత్వ పరంగా ఎటువంటి పర్యవేక్షణా ఉండటంలేదు. దీంతో ఆయా ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో గురుకులాల్లోని పేద విద్యార్థులకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి. విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో కొందరికి సొసైటీలే రూ.లక్షలు ఖర్చు చేసి వైద్యం అందేలా చేస్తున్నాయి.
కొన్ని ఉదాహరణలు
- Free Treatment in Private Hospitals : గిరిజన గురుకులానికి చెందిన ఒక విద్యార్థినికి రక్తకణాల సంఖ్య పడిపోయింది. సొసైటీ అధికారులు పరీక్షలు నిర్వహించగా బోన్‌మ్యారో కేన్సర్‌గా బయటపడింది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా తప్పనిసరిగా డబ్బు కట్టాలని యాజమాన్యం డిమాండ్ చేసింది. దీంతో సొసైటీ అధికారులు రూ.30 లక్షలు వెచ్చించి విద్యార్థినికి చికిత్స చేయించారు.
- ఎస్సీ గురుకులానికి చెందిన మరో విద్యార్థినికి బోన్‌మ్యారో సమస్య వచ్చింది. చికిత్సకు రూ.18 లక్షల వరకు ఖర్చు అవుతాయని అంచనా. ఇప్పటి వరకూ సొసైటీ రూ.8 లక్షలు ఖర్చు చేసింది.
- పాముకాటుకు గురైన విద్యార్థికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు రూ.4లక్షల వరకు వెచ్చించారు.
- ఓ గురుకుల విద్యార్థిని నరాల వ్యాధితో మరణానికి చేరువైనప్పుడు, ప్రైవేటులో చేర్చి రూ.10 లక్షలు ఖర్చు చేశారు. వెంటిలేటర్‌పై నెలన్నరరోజుల చికిత్స అందించగా ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటోంది.
- ఎస్సీ గురుకులానికి చెందిన ఓ విద్యార్థికి ఊపిరితిత్తుల సమస్య బయటపడింది. అతనికి వైద్యం అందించేందుకు రూ.4లక్షలు కట్టాలని ప్రైవేటు ఆసుపత్రి కోరింది. ప్రస్తుతం ఆ విద్యార్థి చికిత్స ఇంకా పెండింగ్‌లో ఉంది.