మారుమూల అటవీ ప్రాంతాల్లో.. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అటవీ శాఖ టెలిమెడిసిన్ (Tele Medicine) సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు, లక్షణాలు ముదిరితే తక్షణ స్పందన, తదితర విషయాలపై అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండటంతో పాటు, అవసరమయితే తక్షణ వైద్యం అందించటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి - పీసీసీఎఫ్ ఆర్. శోభ తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ సాయంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
ఫ్రంట్ లైన్ వర్కర్లతో సమానంగా అడవుల్లో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పీసీసీఎఫ్ సూచించారు. కరోనా లక్షణాలు కనిపించినా, భయపడకుండా వెంటనే ప్రొటోకాల్ ప్రకారం చికిత్స ప్రారంభించాలని, టెలి మెడిసిన్లో 24 గంటల పాటు వైద్యులు, కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చేందుకు అవసరమైన ఏర్పాటు కూడా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చేస్తుందని చెప్పారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులకు కరోనా సోకినా ఎలాంటి మానసిక ఒత్తిడికిలోను కాకుండా చికిత్సా విధానాలను కొనసాగించాలని కోరారు.
కరోనా నుంచి కోలుకున్నాక వచ్చే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ విషయంలోనైనా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అండగా ఉంటుందని, అవసరం మేరకు ఆయుష్ మందులను కూడా ఉద్యోగులకు అందుబాటులో ఉంచుతున్నామని శోభ వివరించారు.
- ఇదీ చూడండి: Sputnik V: టీకా పేరుతో మోసాలు