దేశం కాని దేశంలో ఉన్నాం.. మనం ఏం చెప్పినా అత్తమామలు వింటారు.. ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగే విదేశీ అల్లుళ్ల ఆగడాలకు మహిళా భద్రతా విభాగం చెక్ పెడుతోంది. భార్యను వేధించే వారి పాస్‌పోర్టులు రద్దు చేయిస్తోంది. పాసుపోర్టు లేకుండా విదేశాల్లో ఉండటం నేరం కావడం వల్ల గత్యంతరం లేక కాళ్ల బేరానికి వస్తున్నారు. కేసును ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక పాసుపోర్టులు రద్దయిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
బోల్తా పడుతున్నారు
విదేశీ సంబంధం చేస్తే తమ కుమార్తె సుఖపడుతుందని, విదేశీ అల్లుడంటే సమాజంలో గౌరవం పెరుగుతుందని కొందరు తల్లిదండ్రులు మధ్యవర్తి ద్వారా ప్రతిపాదన రాగానే వారి మాటలకు బోల్తాపడి హడావుడిగా పెళ్లి చేసేస్తున్నారు. ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలవుతున్నాయి. అందరు కాకపోయినా కొందరి విషయంలో మాత్రం విదేశీ సంబంధాలు బోల్తా కొడుతున్నాయి.
అసలు కథ అప్పుడే
పెళ్లి తర్వాత విదేశీ అల్లుళ్లు తమ విశ్వరూపం చూపెడుతుండటం వల్ల చేజేతుల తమ కూతురి జీవితాన్ని నాశనం చేశామని ఆడకూతుళ్ల తల్లిదండ్రులు ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నారు. రకరకాల కారణాలతో భార్యను వేధించడం, భౌతికంగా హింసించడం చేస్తున్నారు. కొందరు ఇంతకుముందే పెళ్లి చేసుకుని కేవలం కట్నం కోసం మరో వివాహం చేసుకున్న ఉదంతాలూ ఉన్నాయి.
ఫ్రాన్స్ అల్లుడు
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ యువతికి.. ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడితో 2013లో వివాహం జరిగింది. 2014లో ఆ యువతి తన అత్తతో కలిసి స్వదేశానికి వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఆమె అత్త ఎవరికీ తెలియకుండా ఫ్రాన్స్ వెళ్లిపోయింది. అప్పట్నుంచి సదరు యువతి తన భర్తతో మాట్లాడేందుకు ఎంతగా యత్నించినా.. సమాధానం రాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించింది.
అమెరికా అల్లుడు
ఎల్బీనగర్ యువతిది మరో గాథ. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లినప్పటి నుంచి అదనపు కట్నం కోసం భర్త వేధించడం మొదలుపెట్టాడు. విపరీతంగా రోజూ హింసించడం వల్ల ఎలాగోలా స్వదేశానికి తిరిగొచ్చిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది. ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు.
రెడ్ కార్నర్ నోటీసులు
వేధింపులకు పాల్పడుతున్న విదేశీ అల్లుళ్లపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినా.. ప్రయోజనం ఉండటం లేదు. విదేశాలతో ముడిపడిన అంశం కావడం వల్ల ఇలాంటి కేసులను సీఐడీకి బదిలీ చేసేవారు. ఇక్కడ కేసు నమోదైతే ఇంటర్‌పోల్ సహకారంతో సీఐడీ అధికారులు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేవారు. ఈ నోటీసుతో నిందితులు తాము ఉంటున్న దేశం నుంచి ఎటు వెళ్లినా దొరికిపోయేవారు. ఇంటర్‌పోల్ నిబంధనల ప్రకారం ఏదైనా నేరం నమోదైనప్పుడు నిందితుడు ఉన్న దేశంలోనూ ఆ తరహా నేరానికి చట్టబద్ధత ఉండాలి.
అదే వారికి కలిసొస్తోంది
ఉదాహరణకు వరకట్నం వేధింపులు మన దగ్గర నేరం. కాని చాలా దేశాల్లో వరకట్నం అనే అంశమే ఉండదు. దానివల్ల ఇలాంటి కేసులు నమోదైనప్పుడు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడం సాధ్యం కాదని ఇంటర్‌పోల్ తేల్చేసింది. విదేశాల్లో ఉండి వేధింపులకు పాల్పడుతున్న అల్లుళ్లకు ఈ అంశం కలిసొస్తోంది.
తాట తీస్తోంది
ఇటువంటి కేసుల పరిష్కారంపై తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఇప్పుడు దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు తెప్పించుకుని చట్టం పరిధిలో ఒక కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ ఈ సెల్ కు 119 ఫిర్యాదులు రాగా వాటిలో 76 కేసులు దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేయగా 43 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
కాళ్ల బేరానికొస్తున్న విదేశీ అల్లుడు
న్యాయప్రక్రియ ద్వారానే మొత్తం ఏడుగురు నిందితుల పాస్ పోర్టులు రద్దు చేయించారు. ఎవరిదైనా పాస్ పోర్టు రద్ధైతే సదరు నిందితులు తాను ఉంటున్న దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లే లెక్క. స్వదేశానికి తిరిగి రావడం మినహా వారికి వేరే గత్యంతరం లేదు. పాస్ పోర్టులు రద్దు చేయిస్తుండటం వల్ల చాలా మంది విదేశీ అల్లుళ్లు భయపడుతున్నారని, సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.