Telangana weather updates : రాష్ట్రంలో వర్షాలు తగ్గిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కొద్ది ప్రాంతాల్లో స్వల్పంగా జల్లులు తప్ప వర్షాలు పడలేదు. బుధవారం నుంచి 5 రోజుల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు తెలంగాణలోకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2 నుంచి 6 డిగ్రీల వరకూ తక్కువగా ఉంది. నల్గొండ, ఖమ్మం మినహా మిగిలిన ప్రాంతాల్లో గాలిలో తేమ సాధారణంకన్నా ఎక్కువగా ఉంది.
Telangana weather rains : రెండ్రోజుల క్రితం రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షానికి డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్ పల్లి ,మోపాల్ మండలంలో చెరువులు, కుంటలు మళ్లీ అలుగు పోశాయి. గడుకోల్‌లోని కప్పుల వాగు లోలెవల్ పైవంతెన నుంచి ప్రవహించింది. బోధన్‌లోని వేంకటేశ్వర కాలనీ, సరస్వతినగర్‌లో రహదారులపై భారీగా నీరు చేరింది.
వర్షాల వల్ల నిర్మల్‌లో రోడ్డుపై వెళ్తున్న టాటాఏస్ వాహనంపై భారీ వృక్షం పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు కుంటాల జలపాతం వద్దకు వెళ్తుండగా.. ఖానాపూర్ మండలం ఎగ్బాల్‌పూర్ సమీపంలోకి రాగానే వాహనంపై భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భుచ్చన్న, రవి అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ పరిస్థితి విషమంగా ఉంది.
మరోవైపు భారీ వర్షాలకు రెండ్రోజుల క్రితం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో రోడ్లు వాగులను తలపించాయి. వానహోరుతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రోడ్లు జలమయమయ్యాయి. అసెంబ్లీ, బషీర్‌బాగ్, కోఠి, సుల్తాన్‌బజార్, నాంపల్లి, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, అబిడ్స్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అలాగే నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, ఖైరతాబాద్ కూకట్పల్లి, హైదర్‌నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్ఆర్‌నగర్, ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.