Award to Retd IAS officer Laxmikantham: ఆధ్యాత్మిక పరిమళాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచేందుకు కృషి చేస్తున్న సురేంద్రపురి మ్యూజియం డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతంను తెలంగాణ టూరిజం ఎక్స్లెన్స్ ప్రమోషన్ పురస్కారం వరించింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న సురేంద్రపురి.. ఒక హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయం. పర్యాటకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లగలిగిన హిందూ ధర్మ ప్రదర్శన శాల. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, పురాతన ప్రాముఖ్యం కల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజితంగా అలంకరించి చూపరులకు కనువిందు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం, స్వర్గలోకం, నరకలోకం, పద్మద్వీపం, పద్మలోకాలను దృశ్యరూపంలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. పద్మ రూపంలో అనేక దేవతా రూపాలు చూడవచ్చు.
![Award to Surendrapuri director](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15735734_707_15735734_1656942215745.png)
మహాభారత, భాగవతం వంటి పురాణేతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటాయి. మంధర పర్వత సాయంతో క్షీరసాగర మథనం చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారంలో ఉన్న విష్ణు మూర్తిని చూడవచ్చు. గజేంద్ర మోక్షం సన్నివేశాలు కనువిందు చేస్తాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల శ్రీకృష్ణుడి విశ్వరూపదర్శనం, అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడు విగ్రహం మనసుకు ఆనందాన్ని కలుగచేస్తుంది. గోవర్దనోద్ధరణ, గోపికా వస్త్రాపహరణ, రాక్షస సంహారం మొదలయిన దృశ్యాలను తిలకించవచ్చు. పంచముఖ శివుడు కళకు పెద్ద పీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.
అమ్మవారి వాహనం సింహం నోటి నుంచి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల నమూనా రూపాలు ఇక్కడ ఉన్నాయి. ఆలయం ఆవరణలో గల అద్దాల మండపం, కొండపైన ఉన్న శివాలయం తప్పకుండా చూడదగినవి. ఈ ప్రదేశాన్నంతా వీక్షంచడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.
ఆధ్యాత్మిక ధర్మ ప్రచారాన్ని సురేంద్రపురి మ్యూజియం.. ఆధునిక పద్ధతులలో ప్రచారం చేస్తోంది. సోషియో యాక్టివిటీ థీరి ద్వారా వీటిని ముందుకు తీసుకెళ్తోంది. ఈ అవార్డును అందుకోవడం పట్ల లక్ష్మీకాంతం సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: Woman murder:సైకో కిల్లర్ దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ హత్య