ఏడాది కాలంగా కొవిడ్ నియంత్రణలో, అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్టు రెండు స్వతంత్ర సంస్థలు పేర్కొన్నాయి. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హరియాణ తొలి మూడు స్థానాల్లో నిలవగా.. మౌలిక వసతుల్లో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు మొదటి మూడింటిలో నిలిచాయని వివరించాయి. హైదరాబాద్‌కు చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, హైదరాబాద్‌కే చెందిన మరో సంస్థ ఇండిపెండెంట్ పబ్లిక్ పాలసీ రిసెర్చర్ సంయుక్తంగా అధ్యయనం నిర్వహించినట్టు తెలిపాయి. అధ్యయన పత్రం తాజాగా జర్నల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో ప్రచురితమైంది. కొవిడ్‌ను కట్టడి చేయడంలో అవలంబించిన విధానాలను, ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆసుపత్రుల్లో నెలకొల్పిన సౌకర్యాలను అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నట్టు అవి తెలియజేశాయి. ఉత్తమం, పరవాలేదు, బాగోలేదు, అస్సలు బాగోలేదు.. అనే నాలుగు కేటగిరీల్లో ర్యాంకులిచ్చామని వివరించాయి.
రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడానికి..
- కొవిడ్ నియంత్రణలో భాగంగా గత ఏడాది సెప్టెంబరు 3 నుంచి ఈ నెల 13 వరకూ పలు స్థాయుల్లో వివిధ అంశాల్లో మౌలిక వసతులు కల్పించారు.
- కొవిడ్ చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్యను 42 నుంచి 110కి.. ప్రైవేటులో 117 నుంచి 1,157కు పెంచారు.
- ప్రభుత్వ వైద్యంలో పడకల సంఖ్యను 8,052 నుంచి 15,203కు.. ప్రైవేటులో 10,180 నుంచి 38,579కి విస్తృతం చేశారు.
- ఆక్సిజన్ పడకల సంఖ్యను ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,773 నుంచి 7,560కి.. ప్రైవేటులో 4,440 నుంచి 13,425కు పెంచారు.
- ప్రభుత్వ వైద్యంలో ఐసీయూ పడకలను 1,224 నుంచి 2,170కి పెంచగా.. ప్రైవేటులో 2,040 నుంచి 9,270కి వృద్ధి చేశారు.
- సాధారణ పడకలను సర్కారు దవాఖానాల్లో 2,055 నుంచి 5,473కు పెంచగా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో 3,700 నుంచి 15,884కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
- కొవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ఆర్‌టీ పీసీఆర్ ల్యాబ్‌లను 17 నుంచి 31కి పెంచారు.
ఇదీ చదవండి: రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్ తీవ్ర ప్రభావం