కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ మూడు, నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. భవన నమునాకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఏడు అంతస్తులో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన సముదాయం రానుంది. రూ.400 కోట్లతో భవన నిర్మాణానికి రహదార్లు-భవనాల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. టెండర్ కోసం అంచనాలను ఖరారు తుదిదశకు చేరింది. ఆర్కిటెక్ట్‌లతో కలిసి ఆర్ అండ్ బీ శాఖ అంచనాలను తయారు చేస్తోంది. అంతస్తుల వారీ నిర్మాణాలు, వాటికయ్యే వ్యయం, అంతర్గత నమూనాలు తదితర అంశాలను పరోగణలోకి తీసుకొని అంచనాలను రూపొందించారు. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లేనని చెప్తున్నారు.
ఈ వారంలో లేదా వచ్చే వారంలో టెండర్లు పిలుస్తారని అంటున్నారు. అనుమతుల ప్రక్రియను కూడా ప్రారంభించారు. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేశారు. మొత్తం విస్తీర్ణంలో పది నుంచి 12 శాతంలో మాత్రమే భవనం రానుంది. మిగతా అంతా పచ్చదనం కేటాయించనున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖకు కూడా దరఖాస్తు చేయనున్నారు. గుత్తేదారు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యి పనులు ప్రారంభించేనాటికి అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.