TSRTC Employees Strike : ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని టీఎస్ ఆర్టీసీ ఐకాస రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో టీఎస్ ఆర్టీసీ ఐకాస రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది.
మరోసారి మోగనున్న సమ్మె సైరన్
TSRTC Employees Set For Strike : ఈ సందర్భంగా ఐకాస ఛైర్మన్ కె.రాజిరెడ్డి, ఉప ఛైర్మన్ కె.హన్మంతు ముదిరాజ్ మాట్లాడుతూ.. ఆర్టీసీలోని కార్మిక సంఘాలను సీఎం కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో తమ డిమాండ్ల సాధన కోరుతూ శుక్రవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇస్తామన్నారు. బడ్జెట్‌లో ఆర్టీసీకి 2 శాతం నిధుల కేటాయింపు, రెండు పే స్కేళ్ల అమలు, ఆరు డీఏ బకాయిల విడుదల సహా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఈ నెల 12న శాంతియుత పద్ధతిలో నిరసనలు చేపడతామన్నారు. 13 నుంచి 21 వరకు అన్ని డిపోల్లో కార్మికులతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తామన్నారు.
సార్వత్రిక సమ్మెలోనూ భాగం..
TSRTC Employees Strike 2022 : 24న సమ్మె నిర్వహణపై కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో కలిసి ఆన్‌లైన్ వేదికగా అభిప్రాయాలు సేకరిస్తామని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ రాజిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మెలోనూ ఆర్టీసీ కార్మికులు భాగస్వాములవుతారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఐకాస ప్రతినిధులు వీఎస్‌రావు, కమాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, అబ్రహం వివిధ ఆర్టీసీ డిపోల ప్రతినిధులు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి : TSRTC Losses : తెలంగాణ ఆర్టీసీ గట్టెక్కేదెలా..?