ఆర్టీసీ బస్సు(TSRTC latest news)ల్లో ప్రయాణం సురక్షితం. ఇది నిజమే. దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడమే శ్రేయస్కరం. మహిళలకైతే ఇది మరీ మంచిది. అదీ రాత్రివేళల్లో దూరప్రాంతాలకు ప్రయాణించే మహిళలు ఆర్టీసీని ఆశ్రయించడమే సరైనది. కానీ.. దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు.. అత్యవసరాలను వినియోగించుకోవాలంటే పురుషులు డ్రైవర్‌ను బస్సు ఆపమని చెబుతారు. కానీ మహిళలు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ ధైర్యం చేసి బస్సు ఆపమన్నా.. మూత్రవిసర్జనకు సరైన చోటు ఉండదు. ఇలాంటి సమస్యను ఎదుర్కొన్న ఓ మహిళ ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చింది.
ఆమె విజ్ఞప్తిని స్వీకరించిన ఆర్టీసీ యాజమాన్యం(TSRTC MD sajjanar).. రాత్రివేళల్లో ప్రయాణించేవారు తమ అత్యవసరాల కోసం బస్సును ఆపవచ్చని ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్‌ప్లాజాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో అక్కడున్న సదుపాయ గదుల(కన్వీనియన్స్ రూమ్స్) వినియోగించుకోవచ్చని ఇక నుంచి బస్సులో అనౌన్స్ చేయాలి అని టీఎస్‌ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. అత్యవసరాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకురావటంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్(TSRTC MD sajjanar) ఈ మేరకు చర్యలు చేపట్టారు.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు రోడ్డు వెంట ఉండే దాబాలు, మంచి హోటళ్లను గుర్తించాలి. అలాంటి ప్రాంతాల్లో మహిళలు తమ అత్యవసరాలను వినియోగించుకోవడానికి బస్సులను కొద్ది నిమిషాలు నిలపాలి. ఆ పరిస్థితులు లేనిపక్షంలో టోల్‌ప్లాజాలను దాటే క్రమంలో ‘ఇక్కడ సదుపాయ గదులు అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైన వారు ఉపయోగించుకోవచ్చు’ అని డ్రైవర్ బస్సులో అనౌన్స్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రిపూట బస్సులు ఆపే ప్రాంతాలు మహిళలకు సురక్షితమైనవిగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘‘రెండు దశల కరోనా ప్రభావంతో(corona effect on TSRTC)పాటు వివిధ కారణాల వల్ల ఆర్టీసీకి దూరమైన ప్రయాణికులకు చేరువ కావడమే లక్ష్యం. ఇందుకు సరికొత్త ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆర్టీసీ ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రాతిపదికన వినియోగంలోకి తేవడానికి ఏం చేయాలన్న దానిపై సీనియర్ అధికారులతో కమిటీ వేశాం’’ అని టీఎస్ ఆర్టీసీ ఎండీ విశ్వనాథ చెన్నప్ప సజ్జనార్(TSRTC MD VC sajjanar) తెలిపారు.
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి సజ్జనార్(Telangana RTC MD sajjanar).. టీఎస్ఆర్టీసీని ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీని లాభాల్లో నడిపేందుకు ప్రయత్నించడమే గాక.. ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీపై నమ్మకం కలిగేలా చేస్తున్నారు. వారికి కలిగిన ఇబ్బందులను తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నారు.