లాక్డౌన్ నిబంధనలు సడలించినా... కరోనా భయంతో ప్రజలు సొంత వాహనాల్లో ప్రయాణించేందుకే మొగ్గుచూపుతున్నారని, అందువల్ల ఆర్టీసీ ఆదాయం పడిపోయిందని తెలంగాణ ఆర్టీసీ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో బస్సులు నడవడం లేదని, వచ్చిన డబ్బులు డీజిల్ ఖర్చులకే సరిపోవడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల్లో రవాణా రంగానికి కేటాయింపులు చేయలేదని పేర్కొన్నారు.
మార్చి 22వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు నడవనందున ఆదాయం పూర్తిగా పడిపోయిందని రాజిరెడ్డి తెలిపారు. లాక్డౌన్ విధించిన మూణ్నెళ్లు వేల మందికి 50 శాతం జీతం మాత్రమే చెల్లించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోలేదని, ఆర్టీసీకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ డబ్బు, ఆర్థిక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలని కోరారు. ఈ నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి: బాబ్రీ కేసులో ఈనెల 24న అడ్వాణీ వాంగ్మూలం