రాష్ట్రంలో పుష్కలంగా వరి ధాన్యం(rice cultivation telangana) పండిస్తూ రైతులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నా విదేశాలకు బియ్యం ఎగుమతి(rice exports telangana) చేయడంలో తెలంగాణ ఆశించినంత స్థాయిలో పుంజుకోలేకపోతోంది. గతేడాది(2020-21) రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 2 కోట్ల టన్నులకు పైగా ధాన్యం మార్కెట్లకు వచ్చింది. ఇందులో కోటిన్నర టన్నులు రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కొనుగోలు చేసింది. మిగిలినదంతా వ్యాపారులు కొన్నారు. అయినా తెలంగాణ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నట్లు ‘భారత వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి’(అపెడా(Agricultural and Processed Food Products Export)) తాజా నివేదికలో ప్రకటించింది. గత ఆరు నెల(ఏప్రిల్- సెప్టెంబరు)ల్లో 66.16 లక్షల టన్నుల సాధారణ బియ్యాన్ని భారతదేశం నుంచి ప్రైవేటు వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేయడంతో రూ.17,677 కోట్ల ఆదాయం వచ్చింది.
అంతంతమాత్రమే..
రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ 25.04 లక్షల టన్నుల ఎగుమతితో రూ.6,352 కోట్లు ఆర్జించి అగ్రస్థానంలో, తెలంగాణ 17,231 టన్నుల ఎగుమతితో 8వ స్థానంలో ఉంది. సముద్రతీర ప్రాంతం, నౌకాశ్రయాలున్న ఏపీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు వరసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణకు 200 నుంచి 600 కిలోమీటర్ల దూరం వెళితే తప్ప నౌకాశ్రయాలు లేనందున వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22) తొలి ఆరునెలల్లో కేవలం 3 టన్నుల బియ్యం ఎగుమతవ్వడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం(2020-21)లో మొత్తం దేశం నుంచి కోటీ 31 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. తెలంగాణ నుంచి 27,406 టన్నులే పంపగలిగారు. రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను పెంచేందుకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తే రికార్డు స్థాయిలో విదేశాలకు అమ్మడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మార్కెటింగ్‌శాఖ అధికారి ఒకరు వివరించారు.
బాస్మతికి అధిక డిమాండు
భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాలు పండించే బాస్మతి బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండు ఉంది. ఈసారి ఆరునెలల్లో 17.02 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతులపై రూ.10,690 కోట్ల ఆదాయం వచ్చినట్లు అపెడా నివేదికలో ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో బాస్మతి పంట పెద్దగా లేదు. అయినా తెలంగాణ నుంచి 78.64, ఏపీ నుంచి 100 టన్నులను విదేశాలకు పంపడం విశేషం. నాణ్యమైన సన్న బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక డిమాండు ఉంది. దానిని ఆదాయంగా మార్చుకునేలా రైతులను ప్రోత్సహించాలని, ఎగుమతులు లేకుంటే వారికి పెద్దగా మిగలదని మార్కెటింగ్‌శాఖ(telangana marketing department) వర్గాలు తెలిపాయి.