జాతీయ పంచాయతీ పురస్కారాలు 2019లో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. దిల్లీలోని పూసా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణకు 9 అవార్డులు దక్కాయి. 2017-18 గణాంకాల ఆధారంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు వివిధ విభాగాల్లో కేంద్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అవార్డులను అందజేశారు.
గ్రామాల్లో స్వాభిమాన్, స్వచ్ఛత, జీవనోపాధి వంటి అంశాలతో పాటు గ్రామాభివృద్ధిని పరిధిలోకి తీసుకొని అవార్డులను ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ పురస్కారం లభించగా... జగిత్యాల జిల్లాలోని పైడిమడుగు గ్రామానికి బాల్య మిత్ర పురస్కారం దక్కింది. పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్ గ్రామానికి నానాజీ దేశ్ ముఖ్ జాతీయ గౌరవ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. వీటితో పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తికరణ పురస్కారాల్లో మరో రెండు మండలాలకు, నాలుగు గ్రామాలకు పురస్కారాలు లభించాయి.
ఇదీ చూడండి: అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా వంటేరు