పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పాలిసెట్‌కు ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. ఏటా ఈ పరీక్షకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 1.30 లక్షలమంది వరకు దరఖాస్తు చేస్తుండగా ఈ ఏడాది అందులో సగం కూడా దాఖలు కాలేదు. ఆలస్య రుసుంతో దరఖాస్తు గడువు ఈ నెల 12 వ తేదీతో ముగిసింది. మొత్తం 63 వేల దరఖాస్తులే వచ్చాయి.
నికరంగా 48 వేలు మాత్రమే
ఈ ఏడాది జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా పాలిసెట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో 15 వేలమంది అగ్రి పాలిటెక్నిక్ వారే ఉన్నారు. అంటే నికరంగా సాంకేతిక పాలిటెక్నిక్ కోర్సుల కోసం అందిన దరఖాస్తులు 48 వేలు మాత్రమే.
చివర్లో పెరిగిన దరఖాస్తులు
ఈసారి మార్చిలో పూర్తి కావలసిన పదో తరగతి పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 8 నుంచి నిర్వహించాలనుకున్నా అవీ రద్దయ్యాయి. చివరకు అంతర్గత మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల్లో కొంత స్పష్టత రావడంతో దరఖాస్తుల సంఖ్య చివరి రోజుల్లో కొంత పెరిగింది. గతంలో లక్ష మందికిపైగా దరఖాస్తు చేసినా చివరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరే వారు 25 వేలమందే. వేలాదిమంది తమకు ఎంత ర్యాంకు వస్తుంది? పోటీ పరీక్షల్లో తమ సామర్థ్యం ఎంత? అనేది తెలుసుకునేందుకు పరీక్ష రాసేవారు.
ఇదీ చదవండి: కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం