Telangana Debts: ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి అర్థ గణాంకశాఖ రూపొందించిన స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్‌ను.. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో కలిసి వినోద్‌కుమార్ విడుదల చేశారు.
రాష్ట్ర ఆవిర్భావం మొదలు రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి సంబంధించిన వివరాలు, ఇతర రాష్ట్రాలు, దేశ పరిస్థితులతో పోలుస్తూ చేసిన విశ్లేషణను ఇందులో పొందుపరిచారు. కీలకమైన రంగాలు, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు సహా ఇతర వివరాలు ఇందులో ఉన్నాయి. మూలధన వ్యయం ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యమని ఇందులో ప్రభుత్వం తెలిపింది.
కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతో భౌగోళిక సర్వూపం వివరాలతో పాటు కొత్త జోనల్ విధానానికి సంబంధించిన అంశాలను ఈ అబ్‌స్ట్రాక్ట్‌లో పొందుపరిచారు. నిర్దేశిత షరతులు, విధివిధానాలను అనుగుణంగా.. అభివృద్ధి, మూలధన వ్యయం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని వినోద్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. కేంద్రం నుంచి ఏ మాత్రం తోడ్పాటులేదని వినోద్‌కుమార్ ఆరోపించారు.
'తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి నిర్మాణం విలువ పదిరెట్లు పెరిగింది. తీసుకొచ్చిన అప్పు వృథా చేస్తేనే తప్పుపట్టాలి. ప్రతి నెల మొదటి వారంలోనే తీసుకొచ్చిన రుణానికి.. వడ్డీ సహా ఇన్స్టాల్మెంట్ కడుతున్నది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు.'
- వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
ఇదీచూడండి: చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా: కేసీఆర్