కార్తీక పౌర్ణమి వేళ దేవాలయాలు (Kartika pournami news) శివనామస్మరణతో మార్మోగిపోయాయి. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానాల్లో... సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భువనగిరిలోని పచ్చల కట్ట సోమేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానం జాతర వేడుకలు... ఘనంగా జరిగాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బడంపేట శ్రీ రాచన్నస్వామి దేవాలయంలో.. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్యరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్‌లోని నీలకంఠేశ్వర దేవాలయంలో.. ఎమ్మెల్సీ కవిత దీపారాధన చేసి నీలకంఠుడుకి (mlc kavitha news) పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.
గోదావరిలో పుణ్యస్నానాలు..
కాళేశ్వరంలో కార్తీక పౌర్ణమి (Kartika pournami news) సందడి నెలకుంది. త్రివేణి సంగమ తీరం భక్తులతో నిండిపోయింది. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో.. ఉదయం నుంచి మహిళలు పుణ్య స్నానాలాచరించారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి గోదావరిలో పుణ్యస్నానం చేసి.. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. రుద్రేశ్వరున్ని దర్శించుకొని ఆలయం ముందు.. నంది విగ్రహం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
తుంగభద్ర నదీ తీరంలో..
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని.. భద్రాద్రి రామయ్యకు అర్చకులు విశేష తిరుమంజనం నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున.. గోదావరి తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సూర్యాపేట జిల్లాలోని సోమేశ్వరాలయం, మేళ్ల చెరువు స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయం... మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. గద్వాల జిల్లా జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు.. తుంగభద్ర నదీ తీరంలో స్నానలాచరించి.... నదిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీచూడండి: