Niranjan reddy on paddy Procurement: వడ్లు కొనుగోళ్లపై కేంద్రంతో సమావేశం అసంపూర్తిగా ముగిసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. చాలా ఆశతో భేటీకి వస్తే కేంద్రం నిరాశ మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాలేదన్నారు. గత వారం మాదిరిగానే ఇప్పుడూ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం చెప్పిందని నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఏడాదికి ఎంత కొంటారో చెప్పాలని కేంద్రాన్ని అడిగినట్లు చెప్పిన నిరంజన్‌రెడ్డి.. ఎంత కొనేది ముందుగా చెప్పడం సాధ్యం కాదని వారు చెప్పినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై కమిటీ వేస్తున్నట్లు చెప్పారని.. ఏ పంట వేయాలనేది కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారన్నారు.
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఆహార శాఖమంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర మంత్రుల నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, సురేష్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ (Ts ministers meet piyush goyal) భేటీ అయ్యారు. గోయల్‌తో గంటపాటు సమాలోచనలు జరిపారు. రెండు సీజన్లో ధాన్యం సేకరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. అయితే, గోయల్ నుంచి ఇప్పుడు కూడా స్పష్టమైన ప్రకటన రాలేదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
'80-85 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తామని గత సమావేశంలో చెప్పారు. ఇప్పుడేమో.. ఏడాది టార్గెట్ ఇప్పుడే ఎలా చెబుతామని దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. నిర్దిష్టంగా చెప్పట్లేదు. ఎంత ధాన్యం తీసుకుంటారో కూడా స్పష్టం చేయడం లేదు. ఓ వైపు కొనుగోళ్లు జరుగుతుంటే.. ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చెప్పలేని దయనీయ స్థితిలో కేంద్రం ఉండటం చాలా బాధాకరంగా ఉంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం తెలంగాణకు లేఖ ఇచ్చింది. దాన్ని పెంచమని కోరాం. ఆ విషయం ఈరోజు చెబుతారనుకున్నాం.. ఏడాది టార్గెట్ ఇస్తారనుకున్నాం. ఈ రెండూ చెప్పకుండా .. యాసంగిలో వరి వేయొద్దని మాత్రం గట్టిగా చెప్పారు.'
- నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి
ఇవీచూడండి: Tomato Price: 'టమాట ధర... మరో రెండు నెలల పాటు తగ్గేదేలే'