Telangana National Unity Vajrotsavam: అప్పటి హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తై.. 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ... సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు ప్రారంభ వేడుకలను నిర్వహించనుంది. ఇందుకోసం సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీన హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సీఎం ప్రసంగించనున్నారు. ఇందుకోసం పబ్లిక్ గార్డెన్స్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసు సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మంత్రులు, ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆయా జిల్లాల్లో పతాకావిష్కరణ చేసే మంత్రులు, ప్రముఖుల పేర్లను ఇప్పటికే జీఏడీ ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేసింది. 16వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ర్యాలీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువత, మహిళా సంఘాలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు.
18వ తేదీన జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్ర సమరయోధులు, కళాకారులను సన్మానించనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సంబంధిత మంత్రులు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టాల్సిన ర్యాలీలు, కార్యక్రమాల కార్యాచరణను ఖరారు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన ఆర్ధికశాఖ మంత్రి హరీశ్‌రావు ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొనేలా చూడాలన్నారు. ఇందుకోసం జెండాలను ప్రభుత్వమే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
17వ తేదీన హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారాభవన్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. గిరిజన, ఆదివాసీ, గోండు కళారూపాలతో నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నేతలను సభకు ఆహ్వానించారు.
ఇవీ చదవండి: