బడుగు బలహీనవర్గాల కలల సౌధాన్ని నిజం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (rs praveen kumar) అన్నారు. సమాజంలో సివిల్ సర్వెంట్లు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నాటి విద్యా విధానం నేటి పరిస్థితులకు సమతౌల్యంగా లేదన్నారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి.. పేదలకు అందించకపోవడంపై ప్రవీణ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. తమ పరిధిలోని అధికారులను సద్వినియోగం చేసుకొని సమాజంలోని అనగారిన ప్రజలకు చేయూతనందించాలన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర - రాష్ట్ర ఆవిర్భావం పుస్తకాన్ని చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో కోదండరామ్‌తో కలిసి ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు.
నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉద్యోగాల సాధన కోసం నిర్మాణాత్మక పోరాటాలు చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించని రాష్ట్రం... సంక్షోభంలో ఉన్నట్టేనని పేర్కొన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉమ్మడి పోరాటాన్ని నిర్వహించనున్నట్లు కోదండరాం వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం పుస్తకం... భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోదండరాంను రచయిత సన్మానించారు.
ఫామ్‌హౌస్‌లు కట్టడానికి లేదంటే ఆకాశహార్మ్యాలు నిర్మించేందుకు రాజకీయాల్లోకి రాలేదు. మీకలల సౌధాలను నిజం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఆ కలల సౌధాలను కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మీ గుండెల్లో గూడుకట్టుకున్న కలల్ని... అసంపూర్తిగా మన తాతలు, ముత్తాతలు నిజంచేసుకోలేని కలలన్నింటినీ కుడా వెలికితీసి.. వాటన్నింటినీ నిజం చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టే రాజకీయాల్లోకి వచ్చాను. పేదలు అక్కడే ఉంటున్నారు... పక్కనే రెండుపడకల గదుల ఇళ్లు ఉన్నాయి. కానీ వాళ్లను అటువైపు పోనీయరు. అంటే మరళా ఎప్పుడైనా ఎన్నికలు వస్తే వాళ్లు ఓటేస్తారనా..? అసలు ఈ ఎన్నికల కోసమే బతుకుతున్నామా మనం..? -ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్
సంక్షోభంలో చిక్కుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నా... అది మనకు కోపాన్ని తెప్పిచాలే గాని... మన ఆత్మహత్యలకు దారితీయకూడదు. -కోదండరాం, తెజస అధ్యక్షుడు
ఇదీ చూడండి: rs praveen kumar: 'రాజ్యాంగం రాసిందే మా తాత.. అదేలేకపోతే నువ్వెక్కడ కేసీఆర్'