KTR Meets VRA Representatives at Assembly : వీఆర్ఏల ప్రతినిధులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వీఆర్‌ఏ సమస్యలపై చర్చకు సిద్ధమైన సర్కార్ 15 మందితో కూడిన వీఆర్‌ఏల బృందాన్ని అసెంబ్లీకి ఆహ్వానించింది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో వీఆర్‌ఏ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. పే స్కేల్, పదోన్నతులు ఇవ్వాలని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ను వీఆర్ఏ ప్రతినిధులు కోరారు.
అంతకుముందు వీఆర్‌ఏల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. భారీర్యాలీ గా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్‌ఏలను తెలుగు తల్లి వంతెన కింద పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. తెలుగు తల్లి వంతెన పై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పే స్కేలు వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వీఆర్‌ఏలు తరలిరావడంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసుల్ని మోహరించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కేటీఆర్ వీఆర్‌ఏ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై చర్చిస్తున్నారు.