Harish Rao Latest News: సర్కార్ దవాఖానాల్లో కార్పొరేట్ ఆస్పత్రులను తలపించే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పునరుద్ఘాటించారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక పరికరాలతో.. మెరుగైన సౌకర్యాలు.. వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
Harish Rao at Narsingi: జీహెచ్‌ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మినీ డయాగ్నోస్టిక్ హబ్‌ల ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఏకకాలంలో ఈ కేంద్రాలను ప్రారంభించారు. మలక్‌పేటలో డయాగ్నోస్టిక్ మినీ హబ్‌ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నార్సింగిలోని డయాగ్నోస్టిక్ హబ్‌ను మంత్రి సబితారెడ్డితో కలిసి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం టి- డియాగ్నోస్టిక్స్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేశారు.
నగరంలో 20 రేడియోలజీ ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. టి- డయాగ్నోస్టిక్ సెంటర్‌లో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో టి- డయాగ్నోస్టిక్ సెంటర్‌లో 137 పరీక్షలు చేస్తారని చెప్పారు. ఇందులో ఇప్పటికే 24.71 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని అన్నారు.
"టి- డయాగ్నోస్టిక్, రేడియాలజీ ల్యాబ్‌ల కోసం యాప్ ఆవిష్కరించాం. వైద్య పరీక్షల ఫలితాలను యాప్‌లో ఎప్పుడైనా చూసుకోవచ్చు. గూగుల్ యాప్ ద్వారా బస్తీ దవాఖానాలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల అడ్రస్ తెలుసుకోవచ్చు. బ్రిటీష్ వాళ్లు ఏర్పాటు చేసిన గాంధీలోనే ఇప్పటికీ ఆస్పత్రి నడుస్తోంది. నిజాం కాలం నాటి పురాతన భవనంలో ఉస్మానియా ఆస్పత్రి ఉంది. పెరిగిన అవసరాల మేరకు నగరంలో కొత్తగా 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌లో 6 వేల సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి. బస్తీ దవాఖానాల రూపంలో కాలనీల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. మందులు, పరీక్షల కోసం రోగులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కిడ్నీ, లివర్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేస్తున్నాం. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దు."
- హరీశ్ రావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
- ఇదీ చదవండి : అమ్మో.. ఒకే ఇంట్లో 90 కోబ్రాల మకాం!