Minister Gangula on Paddy Procurement : రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా సాగుతోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల భవన్‌లో మెదక్, సిద్దిపేట జిల్లాల‌్లో ధాన్యం సేకరణపై మంత్రి సమీక్షించారు. ధాన్యం సేకరణ, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు, గన్నీ సంచులు, రవాణా, ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Review on Paddy Procurement : తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందవద్దని.... ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో సేకరించాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. రైతులు పుకార్లు నమ్మెద్దని... కరోనా వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం గతంలో 92.45 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని గుర్తు చేశారు. కేంద్రం మోకాలడ్డినా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ధాన్యం సేకరణ సజావుగా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ కేంద్రం నుంచి ఒక్క గన్నీ బ్యాగు రాకున్నా అదనంగా సమకూర్చుకొని సేకరణ చేస్తున్నామని చెప్పారు.
రవాణాలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన తర్వాత ఒక్క గింజ కూడా తరుగు పెట్టొద్దని.... అలాంటి ఘటనలు దృష్టికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకూ రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని... రాజకీయ నిరుద్యోగులే అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్, మెదక్, సిద్దిపేట అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.