Telangana Liberation Day 2022 : కొత్త రూపురేఖలతో తయారు చేయించిన ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని సెప్టెంబరు 17న రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ విగ్రహం ఫొటోలను కాంగ్రెస్ మంగళవారం సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసింది. ‘కుడి చేతిని ఎత్తి ఆశీర్వదిస్తున్నట్లు, ఎడమ చేతిలో కర్ర పట్టుకుని.. సిగతో, నుదుట తిలకం, చెవి దిద్దులు, ముక్కు పుడక, మెడలో వెండి కడ్డీ ధరించి.. అంచు చీర, సంప్రదాయ చీరకట్టుతో నిలబడి’ విగ్రహం ఉంది.
తెరాస ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రూపు రేఖలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. నెత్తిన బంగారు కిరీటం, వజ్ర వైఢూర్యాలను ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉందని ఆక్షేపిస్తోంది. తెలంగాణ తల్లి కష్టజీవి, ఊరి సంస్కృతికి ప్రతిరూపమని పేర్కొంటుంది.