KTR on Employment : రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో తీసుకున్న పాలసీలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలు కేసీఆర్ మదిలో ఎప్పటినుంచో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
KTR at DICCI conference : గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత చైతన్య జ్యోతిని ప్రారంభించారని కేటీఆర్ అన్నారు. ఉమ్మడి ఏపీలో పారిశ్రామికవేత్తలు కరెంట్ కోసం ధర్నాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వాల ముందున్న అతిపెద్ద సవాల్ ఉపాధి కల్పన అని చెప్పారు. అవకాశాలు అందిపుచ్చుకుని స్వశక్తితో ఎదగాలన్న కేటీఆర్.. పారిశ్రామికీకరణతోనే ఉపాధి కల్పన సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉపాధి కల్పన పరిమితంగానే ఉంటుందన్న మంత్రి.. మిగిలిన వారంతా స్వయం ఉపాధి అవకాశాలు, పారిశ్రామికవేత్తలుగా మారాలని సూచించారు.
ఇందుకోసమే 8 ఏళ్లలో దేశానికే ఆదర్శంగా నిలిచే విధానాలను తెలంగాణలో రూపొందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 25వేల అనుమతులు ఇచ్చామని తెలిపారు. దళిత బంధును పుట్నాలు, బటానీల మాదిరిగా పంచేందుకు పెట్టలేదని.. పేదరిక నిర్మూలన అర్థవంతంగా అమలు చేసేందుకే ఈ పథకం తీసుకొచ్చామని వెల్లడించారు. సంపద పునరుత్పత్తి కావాలనేదే దళిత బంధు ప్రధాన ఉద్దేశమని వివరించారు.