- " class="align-text-top noRightClick twitterSection" data="">
- తెరాస 21 ఏళ్ల యుక్తవయసుకు చేరింది. ఇప్పుడు పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమేమిటి?
KTR Latest Interview : తెలంగాణకు స్వీయగొంతుక ఉండాలని, ప్రజల ఆకాంక్షలు సాధించాలని కేసీఆర్ తెరాసను ప్రారంభించారు. పార్టీకి ఉద్యమ, పోరాట స్ఫూర్తి ఉగ్గుపాలతోనే వచ్చింది. అదే పంథా కొనసాగిస్తున్నాం. 21 ఏళ్లుగా ప్రజలే కేంద్రబిందువుగా పార్టీ పనిచేస్తోంది. భారత్‌లోని చిన్న రాష్ట్రమైన తెలంగాణ చైనాకంటే వేగంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్ల వ్యవధిలోనే నిర్మించి చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో 60 ఏళ్లుగా ఉన్న విద్యుత్తు సమస్యను అయిదు నెలల్లోనే అధిగమించింది. ఫ్లోరైడ్ భూతాన్ని రెండేళ్లలో తరిమికొట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. గోల్‌మాల్ గుజరాత్ నమూనా కావాలా? గోల్డెన్ తెలంగాణ కావాలా? అనే చర్చ దేశమంతటా నడుస్తోంది.
- ఖమ్మం తదితర చోట్ల తెరాస నేతల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి? పార్టీలో క్రమశిక్షణ అదుపు తప్పుతోందా?
Telangana Minister KTR Latest Interview : వాటిని విభేదాలుగా ఎందుకు చూడాలి. పార్టీ బలంగా ఉందనుకోవచ్చు కదా! ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఒకరికి మించి పోటీపడుతున్నారు. పార్టీ బలంగా ఉండి, మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది.
- ఎమ్మెల్యేలపై అసంతృప్తి, ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరుగుతోందన్న వాదనపై మీ అభిప్రాయం?
ప్రభుత్వాలపై వ్యతిరేకత అత్యంత సహజం. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలు తీర్చడం ఎవరికీ సాధ్యం కాదు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత పెద్దగా లేదు. 2014 ఎన్నికల్లో తెరాస 63 సీట్లు సాధించింది. 2018లో దాదాపు 90 సీట్లు గెలిచాం. దీని వల్ల మా బలం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఎక్కడైనా ఎమ్మెల్యేలపై అసంతృప్తులు ఉంటే వాటిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
- తెరాస నేతల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వీటిపై పార్టీ ఎందుకు స్పందించడం లేదు?
ఇది నిజం కాదు. రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల ఆత్మహత్యలకు సంబంధించి తెరాస నేతలపై ఆరోపణలు రాగా.. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో మాట్లాడా. నిందితులు వెంటనే లొంగిపోవాలని, వారు ఎక్కడైనా ఉంటే పోలీసులకు అప్పగించాలని చెప్పా. తప్పు చేసిన వారి విషయంలో తరతమ భేదాల్లేవు. మీడియాలో వచ్చింది... ప్రతిపక్షాలు చెప్పేదే నిజం కాదు. వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి. ఖమ్మంలో యువకుడిని రెచ్చగొట్టి లేని పంచాయితీ పెట్టించారు. ఏ మాత్రం ఆధారాల్లేకుండా విపక్షాలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నాయి. మంత్రి పువ్వాడపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదు. బండి సంజయ్ హత్య చేశారని నేను చెబుతా.. ఎవరైనా నమ్ముతారా?
- రాజ్‌భవన్, ప్రగతిభవన్‌కు దూరం ఎందుకు పెరిగింది?
రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర చాలా చిన్నది. రాష్ట్రానికి రాజ్యాంగం తరఫున అధిపతి. అది నామినేటెడ్ పోస్టు. ఎవరిని నియమిస్తే వారు వచ్చి పనిచేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కీలకం. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేని వారే గవర్నర్లుగా ఉండాలని, సర్కారియా కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండు చేశారు. తీరా ఆయన ప్రధాని అయ్యాక చేసిందేమిటి? తమిళనాడు రాష్ట్ర భాజపా అధ్యక్షురాలిని గవర్నర్‌గా వేశారు. ఆమెకు రాజకీయవాసనలు పోలేదు. గవర్నర్‌ను అన్ని విధాలా గౌరవించాం. కానీ గౌరవమర్యాదలు పరస్పరం ఉండాలి. తనను తాను గొప్పగా ఊహించుకొని ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పడేస్తాను.. ఫైలు ఆపితే 15 రోజుల్లో ప్రభుత్వం పడిపోయేది అని చెప్పడం ఏమిటి?
- అత్యంత ధనిక రాష్ట్రం అని చెబుతున్నారు. అధికంగా అప్పులు చేస్తున్నారన్న విమర్శలకు మీరేం చెబుతారు?
రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ఏ సమస్యలూ లేవు. దీంతో విపక్షాలు పనికిరాని విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడే అప్పులుచేస్తోంది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీఎస్‌డీపీ)లో అప్పుల నిష్పత్తి కేవలం 22 శాతమే. అదే కేంద్ర ప్రభుత్వంలో 65 శాతం ఉంది. మోదీ ప్రధాని అయ్యాక రూ.132 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. అప్పును ఉత్పాదక పెట్టుబడిగా భావించాలి. తెలంగాణలో విద్యుత్తు సాగు, తాగునీటి రంగాలకు వెచ్చించడం ద్వారా సంపదను సృష్టిస్తున్నాం.
- ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరుగుతోందంటున్న విపక్షాల మాటలకు మీ సమాధానం?
ఎలాంటి ఆధారాల్లేకుండా విపక్షాలు సొల్లు పురాణం చెబుతున్నాయి. మరోవైపు కేంద్రం చేస్తుందేమిటి దేశవ్యాప్తంగా మోదీ-ఈడీ, జుమ్లా-హమ్లా తప్ప మరో మాటే వినిపించడం లేదు. దేశంలో 21 భాజపా పాలిత రాష్ట్రాలున్నాయి. అక్కడ అవినీతి లేదు. అక్కడంతా సత్యహరిశ్చంద్రులే. సుజనాచౌదరి, సీఎం రమేశ్ లాంటి వారి మీద ముందు కేసులుంటాయి. భాజపాలో చేరిన తర్వాత ఆ ఊసే లేదు. బండి సంజయ్ చీటికిమాటికి సీఎంను జైలులో పెడతామంటున్నారు. మేం కూడా మోదీని జైలులో పెడతామని అనవచ్చు. గుజరాత్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మోదీపై విమర్శలు చేశారని ఆయనను అరెస్టు చేశారు. నేనూ అదే అంటున్నా. మోదీ చెప్పేవి గాంధీ సిద్ధాంతాలు.. ఆచరించేవి గాడ్సేవి. నన్ను కూడా అరెస్టు చేసి జైలుకు పంపుతారా?
- 111 జీవో రద్దు వెనుక ఇన్‌సైడర్ ట్రేడింగు జరిగిందా?
ఆధారాల్లేకుండా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల క్రితం జీవో రద్దు గురించి తెలిపారు. ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఆలస్యమైందని అనాల్సింది పోయి అవినీతి అంటున్నారు. కాంగ్రెస్, భాజపాలు తమ ఎన్నికల ప్రణాళికలో జీవో 111 రద్దు గురించి చెప్పాయి. ఇప్పుడు రద్దుకు మద్దతు ఇస్తున్నారా..వద్దంటున్నారా? వాటి ఉద్దేశమేంటో చెప్పాలి.
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇకపై ఎలాంటి ఛార్జీలు పెంచేది లేదని చెప్పారు. మళ్లీ ఇప్పుడు విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు ఎలా పెంచారు?
2014లో ముడిచమురు గ్యాలన్ ధర 105 డాలర్లు. ఇప్పుడూ అంతే ఉంది. అప్పుడు పెట్రోలు రూ. 75. ఇప్పుడు రూ. 105. గత ఏడేళ్లలో తెలంగాణ ప్రభుత్వ వ్యాట్ 35 శాతానికి మించలేదు. కానీ, కేంద్రం సెస్సుల పన్నులు పెంచింది. వారు డీజిల్ రేటు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచవద్దంటే ఎలా? కరెంటుపై భారం పెరిగినా ఒక్కసారే ఛార్జీలు పెంచాం.
- ఏపీతో నీటి వివాదాలు ఎప్పుడు పరిష్కారమవుతాయి?
వివాదాలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. సర్వహక్కులు కేంద్రానికి ఉన్నా పంచాయితీని తేల్చడం లేదు.
- విపక్షాల బలం పెరుగుతోందన్న వాదనతో ఏకీభవిస్తారా?
వాపును చూసి బలుపు అనుకోవద్దు. టీవీలు, సామాజిక మాధ్యమాలు, అరుపులు, కేకలు, హడావిడిని నమ్మొద్దు. 2018 ఎన్నికల్లో భాజపా 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఎంఐఎం మా ప్రత్యర్థి కావచ్చు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఏడు సీట్లను సాధించింది. భాజపా ఒకటి గెలిచింది. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది.
- ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఎప్పుడు తెరమీదికి వస్తుంది?
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సుదీర్ఘ రాజకీయానుభవం ఉంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. వారితో మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ కూటమి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏం జరుగుతుందనేది ఆయనే వెల్లడిస్తారు. భౌగోళికంగా తెలంగాణ దేశంలో 11వ స్థానం, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థకు నాలుగో అతి పెద్ద భాగస్వామిగా ఉంది. రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా రూ.3,65,797 కోట్లను కేంద్రానికి చెల్లించగా... అందులో రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే తెలంగాణకు వాటాగా వచ్చాయి. మరో రూ. 2 లక్షల కోట్లను జాతి నిర్మాణానికి రాష్ట్రం అందించింది.
- రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌తో కలిసి తెరాస పనిచేస్తోంది. ఆయన కాంగ్రెస్‌తో జతకడుతున్నారు? ఇది ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ఆటంకమా!
ఆయన కాంగ్రెస్‌తో సమావేశమవుతున్నారని పత్రికల్లో చూస్తున్నాం. వాస్తవం ఏమిటో తెలిశాక ఏం చేయాలో ఆలోచిస్తాం.
- కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతారు?
ఆశ ఉండాలి గానీ, దురాశ ఉండొద్దు. నేను సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయ్యాను. వారికి శాశ్వతంగా రుణపడి ఉంటా. మంత్రిని అవుతాననుకోలేదు. దయతో సీఎం నాకు పదవి ఇచ్చారు. ఇప్పుడు గెలిచి తిరిగి అధికారంలోకి రావాలి. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో అవకాశం ఇస్తే మంత్రిగా ఉంటాను. లేకపోతే పార్టీ కోసం పనిచేస్తా.
ఇవీ చదవండి :