ఇకపై రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎలాపడితే అలా మాట్లాడినా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు దూషించినా, తెలంగాణను కించపరిచినా, రాష్ట్ర ప్రయోజనాలు, పురోగతి, గణాంకాల విషయంలో అబద్ధాలతో తప్పుదారి పట్టించినా రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనుకాడబోమని తెరాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు అన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో సీఎంను చెంపదెబ్బ కొడతామన్న కేంద్ర మంత్రిపై అక్కడి కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వం కేసులు పెట్టిందని, దానినే తాము స్ఫూర్తిగా తీసుకుంటామన్నారు. ఎవరి బాగోతమేంటో, అక్రమ సంపాదన ఎంతో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతామన్నారు. తమ పార్టీ శ్రేణుల సహనానికీ హద్దు ఉంటుందని, మితిమీరి మాట్లాడితే బట్టలు ఊడదీసి కొడతామన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘నాపై కొందరు డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు. నాకు.. డ్రగ్స్ కేసుకు ఏంసంబంధం? నేను అన్ని డ్రగ్స్ అనాలసిస్ పరీక్షలకు సిద్ధం. రక్తం, వెంట్రుకలు ఏదడిగినా ఇస్తా. మరి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ కూడా సిద్ధమేనా’’ అని సవాల్ చేశారు.
పీసీసీ పదవి కొనుక్కున్నోళ్లు.. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోరా?
పీసీసీ అధ్యక్ష పదవిని కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని ఆ పార్టీ ఎంపీయే స్వయంగా వెల్లడించారని, ఇవాళ పీసీసీ పదవి కొనుక్కున్నోళ్లు.. రేపు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోరా అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ నిర్వహించిన గజ్వేల్ సభలో ప్రభుత్వంపై ఛార్జిషీటు అనడం విడ్డూరంగా ఉంది. క్రిమినల్స్, రోజూ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్లకు మాత్రమే ఛార్జిషీట్ల గురించి తెలుస్తుంది. అదే నిరూపించుకున్నారు. ఆ పార్టీకి హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకునే దమ్ము లేదు’’ అని అన్నారు.
చరిత్రకు మతం రంగు పూస్తున్న భాజపా
కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చి ఒక మతాన్ని కించపరిచేందుకు విమోచన దినం అంటూ రాద్ధాంతం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘‘కమ్యూనిస్టుల పోరాటాన్ని వారిదిగా చెబుతూ భాజపా.. చరిత్రకు మతం రంగు పూస్తోంది. అసలు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పడు ఆ పార్టీ ఎక్కడుంది? తెలంగాణకు 2014 జూన్ 2 తేదీనే అసలైన విమోచన దినం. ఆరోజే రాష్ట్రానికి నిజమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వచ్చాయి. సాయుధ పోరాటం చేసిన కొందరికి కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్‌కు చెప్పి పింఛన్లు ఇప్పించారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా వారికి ఎందుకు ఇవ్వడంలేదు? మాజీ మంత్రి జానారెడ్డి కంటే ఈటల రాజేందర్ గొప్ప వ్యక్తేం కాదు. నాగార్జునసాగర్ మాదిరే హుజూరాబాద్‌లో తెరాస ఘన విజయం సాధిస్తుంది’’ అని కేటీఆర్ అన్నారు.
దిల్లీ పార్టీలకు తెలిసింది చిల్లర రాజకీయాలే
‘‘దిల్లీ పార్టీలకు చిల్లర రాజకీయాలు మాత్రమే తెలుసు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది మాత్రం తెలియదు. అధికారంలో ఉన్న తెరాస అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. ప్రతిపక్షాలకు పని లేక ఒకరు పాదయాత్ర చేస్తున్నారు. మరొకరు తాను మార్కెట్‌లో ఉన్నానని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యవహారం స్థిరాస్తి బూమ్‌ను తలపిస్తోంది. మంత్రి మల్లారెడ్డి సవాల్‌కు భయపడి పారిపోయినోడు.. నోటికి పని చెబుతున్నాడు. బీసీ బంధు కావాలంటున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దేశంలో ఉన్న ప్రతి బీసీకి, బలహీన వర్గాలకు లక్షలు పంచాలని ప్రధాని మోదీకి చెప్పాలి. తెలంగాణలో ఎంఐఎం పార్టీకి భాజపా భయపడుతోంది.
ఓట్లు చీల్చడానికే కొత్త పార్టీలు..
ప్రతిపక్షాలు తెలంగాణను వైఫల్య రాష్ట్రంగా చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు జాతీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నాయి. కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నాయి. తెరాస ఓట్లను చీల్చడమే వాటి ధ్యేయం. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ గతంలో కేసీఆర్‌ను పొగిడారు. ఇప్పుడేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలు, వైద్యకళాశాలలు, ఐఐఎం వంటి విద్యాసంస్థలు ఇవ్వనందుకు ఆయన కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు? షర్మిల కూడా కాంగ్రెస్, భాజపాల వైఫల్యాలపై మాట్లాడడం లేదు.
నాకూ కూతురు ఉందని కన్నీళ్లు పెట్టుకున్నా
సింగరేణి కాలనీలో బాలిక ఘటన దురదృష్టకరం. నాకూ కూతురు ఉందని కన్నీళ్లు పెట్టుకున్నా. అలాంటి సందర్భాల్లో చట్టం తనపని తాను చేసుకుంది. తెలంగాణలో ఘాతుకం చేసిన వారికి స్థానం లేదని రుజువైంది. అక్కడికి సీఎం, మంత్రులు వెళ్లి పరామర్శల హడావిడి చేయడం సరికాదు’’ అని కేటీఆర్ అన్నారు.
సుపారీ ఇన్‌ఛార్జుల మాటేమిటి?
ట్విటర్‌లో మాణికం ఠాగూర్‌ను ప్రశ్నించిన కేటీఆర్..
ఈనాడు, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూషించిన ఆడియోను రికార్డు చేసిన జర్నలిస్టును కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ సుపారి జర్నలిస్టుగా పేర్కొనడంపై మంత్రి కేటీఆర్ శనివారం ట్విటర్‌లో అభ్యంతరం తెలిపారు. అలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. ‘‘పీసీసీ అధ్యక్ష పదవిని విక్రయించారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఆ పని చేసిన సుపారీ ఏఐసీసీ ఇన్‌ఛార్జుల సంగతేమిటి’’ అని కేటీఆర్ ట్విటర్‌లో ప్రశ్నించారు.