KTR About Electronics Field: ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో... రాబోయే పదేళ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించటమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో తెలంగాణ బహుముఖంగా దూసుకెళ్తుందని పునరుద్ఘాటించారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతోందని తెలిపారు. హైదరాబాద్ రావిర్యాల ఈ-సిటీలో రేడియెంట్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో తొలి ఎల్‌ఈడీ టీవీలు తయారు చేసే ప్లాంట్‌గా ఈ సంస్థ గుర్తింపు పొందనుంది.
KTR About Radiant Electronics: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తుల క్లస్టర్లు ప్రస్తుతం రెండు ఉన్నాయని... మరో 2 ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల విస్తరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రేడియంట్ సంస్థ రెండేళ్లలో 5 మిలియన్ ఎల్‌ఈడీ టీవీలు తయారు చేసిందని చెప్పారు. 3,800 మందికి ఉపాధి కల్పిస్తోందని అన్నారు. నూతన ప్లాంట్ ద్వారా మరో వెయ్యి మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. మేకిన్ తెలంగాణ నినాదంతో ఎల్‌ఈడీ టీవీలు తయారు చేస్తున్న సంస్థ అని వివరించారు.
"ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ మరింత పెంచితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాబోయే సంవత్సరం కాలంలో రెట్టింపు స్థాయిలో ఉపాధి అవకాశాలుంటాయి. రాష్ట్రంలో సానుకూల వాతావరణంతోనే పరిశ్రమలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. 2021లో అత్యధికంగా పన్నులు చెల్లించిన వ్యక్తి రేడియెంట్ సంస్థ ఎండీ. నెలకు 4 లక్షల టీవీలు తయారు చేసే సామర్థ్యానికి రేడియెంట్ సంస్థ చేరింది. ఈ సంస్థలో 63 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు. దేశంలోనే ప్రముఖ బ్రాండ్ టీవీలన్నీ ఇక్కడి నుంచే తయారవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ సంస్థను మరింత విస్తరిస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. వచ్చే ఏడాది నాటికి ఈ ఫ్యాబ్ సిటీ కేంద్రంలో 40 వేల మందికి ఉపాధి దొరుకుతుంది."
- కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
"దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న వ్యాపారులంతా తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇందుకు కారణం మంత్రి కేటీఆర్. రేడియెంట్ సంస్థలో 14 సెకన్లకు ఒక టీవీ తయారవుతుంది. 5 సెకన్లకు ఒక టీవీ తయారు చేయాలనే సంకల్పంతో రేడియెంట్ కృషి చేస్తోంది."
- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
అంతకుముందు.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల పంచాయతీ పరిధిలోని పీ అండ్ జీ పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ డిటర్జెంట్స్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి :