ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి వరుసగా రెండు ఏడాదీ ఎటువంటి పరీక్షలు లేకుండానే ఫలితాలు వెల్లడయ్యాయి. కరోనా తీవ్రత కారణంగా ఈ ఏడాది కూడా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు కావడం వల్ల.. తొలి ఏడాది మార్కుల ఆధారంగా ఫలితాలను ఖరారు చేశారు. ప్రయోగ పరీక్షల్లో అందరికీ గరిష్ఠ మార్కులు కేటాయించారు. మొదటి సంవత్సరంలో ఫెయిలైన సబ్జెక్టుకు రెండో సంవత్సరంలో కనీస ఉత్తీర్ణత మార్కులను ఇచ్చారు. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.
తొలి ఏడాది వారికి పరీక్షలు..
పరీక్ష ఫీజు చెల్లించిన 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు సహా మొత్తం 4,51,585 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రకటించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 1,76,719 మంది ఏ గ్రేడ్, 1,04,886 మంది బీ గ్రేడ్, 61,887 మంది సీ గ్రేడ్, 1,08,093 మంది విద్యార్థులు డీ గ్రేడ్ సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా రెండో ఏడాది ఫలితాలు పొందవచ్చన్నారు. ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు కరోనా పరిస్థితులు మెరుగు పడిన తర్వాత జరిగే ప్రత్యేక పరీక్షలకు హాజరుకావచ్చునని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు... కరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తొలి ఏడాది పరీక్షలు నిర్వహించనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
జులై 5 నుంచి కళాశాలలు.. ఒరిజినల్ మెమోలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. మెమోల్లో తప్పులు దొర్లితే 040 24600110 ఫోన్ నంబరులో ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర వరకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.
ఇదీచూడండి : బీటా వేరియంట్‌పై వ్యాక్సిన్లు ప్రభావవంతమేనా?