రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యాపారాభివృద్ధి, డిజిటలీకరణ కోసం బొంబాయి స్టాక్ ఎక్సేంజ్‌తో తెలంగాణ పరిశ్రమల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం దృశ్యమాధ్యమంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, గ్లోబల్ లింకర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ వాకిల్, బీఎస్‌ఈ సీఎండీ-సీఈవో ఆశిశ్‌కుమార్ చౌహాన్, అంకురాల విభాగాధిపతి అజయ్‌కుమార్ ఠాకూర్‌లు పాల్గొన్నారు.
తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈల సవాళ్లను పరిష్కరించడానికి 2019 ఆరంభంలో పరిశ్రమల శాఖ రాష్ట్ర గ్లోబల్ లింకర్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. యంత్ర, వస్తు పరికరాల సమాచారం, ఆన్‌లైన్ చెల్లింపుల సౌకర్యం గల ఇ-కామర్స్ స్టోర్‌నూ నెలకొల్పింది. ఆయా పరిశ్రమలకు ఆర్థిక వనరుల ఊతం, విశ్వసనీయతను మరింత పెంచేందుకు తాజాగా బీఎస్‌ఈతో ఒప్పందం కుదుర్చుకుంది.
‘‘బీఎస్‌ఈతో భాగస్వామిగా చేరడం ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లపై అవగాహన లేకపోవడం వల్ల ఎంఎస్‌ఎంఈలు లబ్ధి పొందడం లేదు. వాటికి ఖర్చులు, నష్టాలు పెరుగుతున్నాయి. తాజా ఒప్పందం ద్వారా చిన్న పరిశ్రమలకు మద్దతుతోపాటు మార్గనిర్దేశం లభిస్తుంది. బీఎస్‌ఈ.. మానవ వనరులు, నిపుణుల సాయం అందిస్తుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు, వాటి ప్రాధాన్యం, లిస్టింగ్ ద్వారా ఒనగూరే ప్రయోజనాలపైనా అవగాహన కల్పిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా పెద్దఎత్తున చిన్న పరిశ్రమలు బీఎస్‌ఈలో నమోదు చేసుకునే అవకాశం ఉంది’’ అని జయేశ్ రంజన్ తెలిపారు.
‘‘చిన్న పరిశ్రమలు సరళతర విధానంలో లాభాలను ఆర్జించేలా ఎదిగేందుకు మా సంస్థ అండగా నిలుస్తుంది. డిజిటలీకరణ ద్వారా వాటికి మూలధన సమస్య తీరుతుంది’’ అని సమీర్ వాకిల్ తెలిపారు. తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలు తమ సంస్థ ద్వారా ఈక్విటీ, వ్యాపార విస్తరణ అవకాశాలు పొందుతాయని ఆశిశ్‌కుమార్ చౌహాన్ అన్నారు.