రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల క్లస్టర్ల ఏర్పాటుకు ఉన్నత విద్యా మండలి( Telangana State Council of Higher Education)శ్రీకారం చుట్టనుంది. తొలుత ప్రయోగాత్మకంగా... ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)పరిధిలో ఈ తరహా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్లస్టర్ల విధానంపై విధివిధానాలను ఇవాళ ఉన్నత విద్యా మండలి ఖరారు చేయనుంది. ఈ మేరకు కళాశాలలను క్లస్టర్లుగా విభజించి, వాటిలోని బోధన సదుపాయాలు, ఇతర వసతులను పరస్పరం ఉపయోగించుకోనున్నారు. అలాగే ఒక కాలేజీలో చేరిన విద్యార్థి ఆ క్లస్టర్ పరిధిలోని... ఇతర కళాశాలల్లోనూ లేబొరేటరీలు, బోధన సదుపాయాలను వినియోగించుకొనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉపాధ్యక్షుడు వి.వెంకట రమణ, నవీన్ మిత్తల్, ఓయూ, జేఎన్టీయూహెచ్, అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీలు రవీందర్, కట్టా నర్సింహారెడ్డి, సీతారామారావుతో కూడిన కమిటీ దీనిపై కొంతకాలంగా కసరత్తు చేసి ప్రతిపాదనలను సిద్ధం చేసింది.
మరోవైపు... రాష్ట్రంలో కొత్తగా బీఏ ఆనర్స్ కోర్సు ప్రవేశ పెట్టనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం కోఠి మహిళ కళాశాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ చేతుల మీదుగా ఈకోర్సును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
ఇదీచూడండి: స్కూళ్లు తెరవాలని మైనర్ పిటిషన్- షాకిచ్చిన సుప్రీం