హైదరాబాద్ ఖానామెట్‌లో సుమారు రెండెకరాల విస్తీర్ణంలోని 17వ ప్లాటు వేలం బిడ్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల్లో ప్రస్తుత స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. వేలం ప్రక్రియ తుది తీర్పునకు లోబడి ఉండాలని ఆదేశించింది. ఖానామెట్‌లో నిన్న ఐదు ప్లాట్లకు వేలం నిర్వహించారు. రెండెకరాల విస్తీర్ణం ఉన్న 17వ ప్లాటును అత్యధికంగా ఎకరానికి 46 కోట్ల 20 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు లింక్ వెల్ టెలీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్ దాఖలు చేసింది.
పూర్వీకుల సమాధులున్నాయని...
ప్లాటు నంబరులో 17లో తమ పూర్వీకుల సమాధులు ఉన్నందున వేలం నిర్వహించవద్దని కోరుతూ నలుగురు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. కౌంటర్ల దాఖలుకు సమయం ఇవ్వాలని పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ తరఫు న్యాయవాదులు కోరారు. తుది నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులనూ ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి ఆదేశించారు.
కోట్లు కురిపించాయి..
ఖానామెట్ భూములు మొత్తం 14.91 ఎకరాల భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.729.41 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో ఎకరం సగటు ధర రూ.48.92 కోట్లుగా ఉండగా.. గరిష్ఠంగా రూ.55 కోట్లు పలికింది. లింక్‌వెల్ టెలీ సిస్టమ్స్ సంస్థ గరిష్ఠంగా 3.15 ఎకరాలను రూ.153.09 కోట్లకు దక్కించుకుంది.