HC on Government Schools: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యా హక్కు చట్టంపై దశాబ్దం క్రితం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ న్యాయవిద్యార్థి బి.అభిరాం దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్, జనగామ జిల్లాల్లోని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు దుస్థితిలో ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కొన్నింటిలో గోడలు కూలిపోయాయని.. బాలికలకు మరుగుదొడ్లు లేవని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం జందుగూడలో పదేళ్ల నుంచి ఓ గుడిసెలో పాఠశాల నడుస్తోందని... మంచిర్యాల జిల్లా పొన్నారంలో ఓ బడిని పశువుల కొట్టంగా వాడుతున్నారని తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో వసతులపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి: