ఆరో విడత హరితహారంలో భాగంగా పల్లెల్లో చిట్టడువులను పెంచాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఊరికి దగ్గరలోనే.. ‘యాదాద్రి ప్లాంటేషన్’ తరహాలో ఖాళీగా ఉన్న, ప్రభుత్వ భూముల్లో ఈ వనం ఏర్పాటు చేయనున్నారు. ఎకరా విస్తీర్ణంలోనే అన్ని రకాల మొక్కతో చిట్టడవి సృష్టించనున్నారు. ఇందుకోసం అటవీశాఖలో బీట్ అధికారి నుంచి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌స్థాయి వరకు 600 మంది అధికారులకు పల్లె ప్రకృతివనాల ఏర్పాటుపైరాష్ట్ర అటవీ అకాడమీ శిక్షణ అందిస్తోంది.
ఉపాధి హామీతో..
14వ తేదీ వరకు 300 మందికి ఆన్‌లైన్‌లో శిక్షణ అందించింది. పల్లె వనాల పెంపకానికి ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ వీవీఎన్ ప్రసాద్ దీనిపై ప్రత్యేకదృష్టి పెట్టారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటుచేసే ఈ పల్లె ప్రకృతి వనాలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అటవీశాఖ అందించనుంది.
లక్ష్యాలు.. ప్రణాళిక
- భూసారాన్ని పెంపొందించడం, తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం సృష్టించడం, ప్రజల్లో మొక్కల పట్ల అవగాహన, బాధ్యత పెంచడం. స్థానికంగా పెరిగే చెట్ల జాతులకు ప్రాధాన్యం ఇవ్వడం.
- విస్తీర్ణం ఎకరా అయితే- 0.23 ఎకరాల్లో చిట్టడవిని.. 0.16 ఎకరాల్లో పొద మొక్కలు, 0.19 ఎకరాల్లో మధ్యస్తంగా పెరిగే మొక్కలు, 0.22 ఎకరాల్లో ఎత్తుగా నీడనిచ్చే చెట్లను నాటతారు. వీటితో పాటు 0.07 ఎకరాలు ఖాళీ స్థలం, 0.13 ఎకరాల్లో నడకస్థలం అభివృద్ధి చేస్తారు.
నాటే మొక్కలివీ
చిట్టడవిలో: ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, శ్రీగంధం, చింత, వెదురు, అల్లనేరేడు సహా 20 రకాల మొక్కల జాతుల్లో ఐదారు నాటతారు.
లోపలి వరుసలో: మల్లె, కృష్ణతులసి, తంగేడు సహా 12 రకాల్లో ఐదారు..
మధ్య వరుసలో: జామ, సీతాఫలం, దానిమ్మ, నిమ్మ సహా 14 రకాల్లో ఐదారు..
బయట వైపు: కదంబ, వేప, రేల, నెమలినార, రావి, బాదం సహా 25 రకాల్లో ఐదారు జాతులు.
రెండేళ్లలోనే అడవి సృష్టి
అడవిని సృష్టించాలంటే జీవితకాలం సరిపోదనే భావన.. కొత్త పద్ధతితో మారింది. చౌటుప్పల్, నారాయణ్‌పూర్, కండ్లకోయ వంటి చోట్ల అటవీశాఖ రెండేళ్లలోనే అడవిని సృష్టించింది. పచ్చదనమే కాదు రకరకాల పాములు, ఉడతలు, పక్షులు, సీతాకోకచిలుకలతో అక్కడ జీవవైవిధ్యం ఏర్పడింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ను ఈ వనాలు బంధిస్తున్నాయి. పోగొట్టుకున్న అడవిని అనతికాలంలోనే సృష్టించగలమన్న నమ్మకం కలుగుతోంది.
- జి.చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ