భారతదేశ పురోగతి, శ్రేయస్సు, సుస్థిర అభివృద్ధిలో ఆవిష్కరణలు చాలా కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ - టీసీఏ(TCA) ఆధ్వర్యంలో జాతీయ విద్యావిధానం - 2020పై జరిగిన జాతీయ వెబినార్‌లో తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాలు కల్పిస్తూ పరిశోధన, ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ పిలుపునిచ్చారు. జాతీయ విద్యావిధానం 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య ఉండాలని సూచించారు.
ఐటీ, ఈ-కామర్స్ వ్యాపారం విస్తరిస్తున్న తరుణంలో ఆ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగడానికి వాణిజ్యం, వ్యాపార నిర్వహణ విద్యపైనా విద్యార్థులకు అత్యాధునిక శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని గవర్నర్ తెలిపారు. మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను నిరంతరం పునః రూపకల్పన చేయాలని ఆయా సంస్థలకు సూచించారు.
'ప్రాక్టికల్-ఓరియెంటెడ్' 'కేస్ స్టడీ బేస్డ్ స్టడీస్' ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. అదే సమయంలో ఇంటర్న్‌షిప్‌ల కోసం విదేశాలకు వెళ్లి నైపుణ్యాలను మెరుగుపరుచుకొనేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో హైదరాబాద్ ఐటీ హబ్, ఫార్మాస్యూటికల్ హబ్‌గా అవతరించడాన్ని ప్రస్తావిస్తూ... వాణిజ్య, వ్యాపార కేంద్రంగా మార్చడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ వి.వెంకటరమణ, టీసీఏ అధ్యక్షుడు, కేరళ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హెచ్.వెంకటేశ్వర్లు, ఉస్మానియా విశ్వవిద్యాలయం కళాశాల వాణిజ్య, వ్యాపార నిర్వహణ విభాగం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప పాల్గొన్నారు.