Tamilisai at Mahila Darbar: మహిళలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉండలేని అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆడవాళ్లను ఆదుకునేందుకు తాను ఎల్లప్పుడు బలమైన శక్తిగా ఉంటానని తెలిపారు. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తానన్న తమిళిసై.. మహిళ బాధపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు.
Mahila Darbar At Raj Bhavan: రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వినూత్న కార్యక్రమాలతో ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న తమిళిసై ఇవాళ మహిళల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఓ అడుగు ముందుకేశారు. వారి సమస్యలు చెప్పుకోవడానికి మహిళా దర్బార్ పేరుతో రాజ్ భవన్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆడవారు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న అంశాలపై చర్చించారు.
'గవర్నర్ ప్రజలను కలుస్తారా అని చాలా మందికి అనుమానాలున్నాయి. కానీ.. ప్రభుత్వ కార్యాలయమైన రాజ్‌భవన్ ఉంది ప్రజల కోసమే. వారి సమస్యలు వినడానికే. వాటిని పరిష్కరించడానికే. కరోనా సమయంలోనూ నేను రోగులను పరామర్శించాను. నా వంతు సాయం చేశాను. సమాజంలో మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారు. ఇంట్లో, పనిచేసే చోట, పాఠశాలల్లో, కాలేజీల్లో, రోడ్లపైన ఇలా ప్రతిచోటా ఆడపిల్లలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది వాటి గురించి ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేక.. వేధింపులు తట్టుకోలేక వారిలో వారే కుమిలిపోతున్నారు. కొన్నిసార్లు భరించలేని మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదంతా ఆపడానికీ.. తెలంగాణ మహిళలకు నేనున్నానని చెప్పడానికే ఈ మహిళా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేశాను.' -- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
మహిళా దర్బార్ నిర్వహణపై వస్తున్న విమర్శలపై గవర్నర్ ఘాటుగా స్ఫందించారు. రాజ్యంగబద్ధంగా ఉన్న హక్కుల మేరకే నడుచుకుంటున్నానని పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసే వారు.. ముందుగా రాజ్యాంగానికి కనీస విలువ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానన్న గవర్నర్... రాజ్‌భవన్‌లో ఎలాంటి రాజకీయ కార్యక్రామాలు చేపట్టడం లేదని స్ఫష్టం చేశారు. ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాన్ని తాను గౌరవిస్తానని.... అయితే ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్స్‌ని పాటించటం లేదని పునరుద్ఘాటించారు. మహిళలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో మాత్రమే మహిళా దర్భార్ నిర్వహించినట్టు తెలిపారు. దర్బార్ ద్వారా తన ముందుకు వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని.. వాటిపై స్ఫందించాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్ ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ని ఎప్పుడు కలుస్తాన్న ప్రశ్నకు.. జూన్ 2 నాటికి ముఖ్యమంత్రిని కలవకుండా ఏడాది పూర్తైందంటూ చమత్కరంగా సమాధానమిచ్చారు. ఇక రాష్ట్రపతి రేసులో తమిళసై పేరు వినిపిస్తుందన్న ప్రశ్నకు గవర్నర్ కేవలం నమస్కారంతో సరిపుచ్చారు.
'మహిళా దర్బార్ నిర్వహణలోరాజకీయ ఉద్దేశం లేదు. రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. రాజ్‌భవన్‌ను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలు చెప్పిన సమస్యలు పంపుతా.. ప్రభుత్వం స్పందించాలి. జూబ్లీహిల్స్ అత్యాచారంపై నివేదిక కోరినా ఇంకా ఇవ్వలేదు. మహిళా దర్బార్‌ను భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. ప్రభుత్వం ప్రొటోకాల్ సరిగా పాటించడం లేదు. మహిళలపై అకృత్యాలు నా హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. బాధిత మహిళలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. తెలంగాణ ఆడబిడ్డలకు ఆలంబనగా.. తోడుగా ఉంటాా. మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని భావిస్తున్నా. నాకు ఎదురు చెప్పేవాళ్లను పట్టించుకోను.' -- తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్
ఇవీ చదవండి..